సంక్రాంతి పండుగను దృష్టిలో పెట్టుకుని.. ప్రత్యేక బస్సులు నడిపేందుకు ఏపీఎస్‌ఆర్టీసీ సన్నద్ధం అవుతోంది. 10 రోజుల్లో పండుగ రానుంది. ఇక పట్నాల నుండి పల్లెలకు వెళ్లేందుకు ప్రజలు సిద్ధమవుతున్నారు. చాలా మంది ఇప్పటికే సొంతూళ్ల ప్రయాణం మొదలు పెట్టారు. అయితే ప్రయాణికుల రాకపోకలపై అంచనా వేస్తూ ఏపీఆర్టీసీ ప్రత్యేక బస్సు ఏర్పాట్లు చేస్తోంది. జనవరి 7వ తేదీ నుండి 17వ తేదీ వరకు స్పెషల్ బస్సులను నడపనున్నారు. ఏపీలో పలు ప్రాంతాల నుండి హైదరాబాద్‌కు 2,500, విశాఖకు 850, విజయవాడకు 600, బెంగళూరుకు 300, చెన్నైకి 120 బస్సులను నడిపేందుకు అధికారులు ఏర్పాట్లు చేశారు. దీంతో పాటు జిల్లా కేంద్రాల నుండి ప్రధాన పట్టణాలకు మరిన్ని ప్రత్యేక బస్సులు తిరుగుతాయని అధికారులు తెలిపారు.
ఇక ప్రత్యేక బస్సుల్లో ప్రయాణించేవారి కోసం ముందస్తు రిజర్వేషన్ సదుపాయం కూడా కల్పించబడింది. ఏపీఎస్‌ఆర్టీసీ నడిపే ప్రత్యేక బస్సుల్లో 50 శాతం అదనపు ఛార్జీలను వసూలు చేయనున్నారు. మొత్తంగా సంక్రాంతికి ప్రత్యేకంగా 6,970 బస్సులను ఏపీఎస్ ఆర్టీసీ నడపనుంది. తెలంగాణ ఆర్టీసీ కూడా సంక్రాంతి పండుగకు ప్రత్యేక బస్సులను నడిపేందుకు సిద్ధమైంది. పట్నాల నుండి పల్లెలకు వెళ్లే ప్రజల కోసం 4,360 బస్సులను ఏర్పాటు చేస్తామని టీఎస్ ఆర్టీసీ ఇటీవల చెప్పింది. 590 బస్సులకు రిజర్వేషన్ సదుపాయం కూడా కల్పించారు. అయితే తెలంగాణ ఆర్టీసీ మాత్రం ఎలాంటి అదనపు ఛార్జీలను వసూలు చేయడం లేదని తెలుస్తోంది. ఈ నిర్ణయంపై తెలంగాణ ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.