అమరావతి: మెగా డీఎస్సీలో ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులకు రేపు సాయంత్రం సీఎం చంద్రబాబు నియామక పత్రాలు అందజేయనున్నారు. అమరావతిలో నిర్వహించే బహిరంగ సభ కార్యక్రమంలో సీఎం చేతుల మీదుగా అభ్యర్థులు నియామక పత్రాలు అందుకుంటారు. వాస్తవానికి ఈ కార్యక్రమాన్ని ఈనెల 19న నిర్వహించాల్సి ఉండగా, వర్షాల కారణంగా ప్రభుత్వం వాయిదా వేసింది.
కాగా ఈ కార్యక్రమంలో ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్, పలువురు మంత్రులు పాల్గొననున్నారు. మొత్తంగా డీఎస్సీలో టీచర్ ఉద్యోగాలు దక్కించుకున్న 15,941 మందికి నియామక పత్రాలు అందజేయనున్నారు. రేపు అసెంబ్లీ వాయిదా పడిన వెంటనే బహిరంగ సభా వేదిక వద్దకు సీఎం చంద్రబాబు సహా పలువురు మంత్రులు చేరుకుంటారు. సభలో జిల్లాల వారీగా ప్రజా ప్రతినిధులు కూర్చునేలా సీటింగ్ ఏర్పాటు చేశారు.