ఏపీకి కేంద్రం గుడ్‌న్యూస్.. రూ. 567 కోట్ల గ్రాంటు విడుదల
గత 19 నెలలుగా వైద్యారోగ్య రంగం అభివృద్ధికి ఎన్డీఏ ప్రభుత్వం చేసిన కృషికి కేంద్రం గుర్తింపు మరోసారి లభించింది.
By - Medi Samrat |
గత 19 నెలలుగా వైద్యారోగ్య రంగం అభివృద్ధికి ఎన్డీఏ ప్రభుత్వం చేసిన కృషికి కేంద్రం గుర్తింపు మరోసారి లభించింది. రాష్ట్రంలో వైద్యారోగ్య రంగానికి 15వ ఆర్థిక సంఘం సిఫారసు చేసిన మొత్తం రూ.2,600 కోట్ల గ్రాంటును పొందటంలో రాష్ట్రం సఫలీకృతమైంది. ఇందులో భాగంగా ఐదవ మరియు ఆఖరి విడతగా రూ.567.40 కోట్ల గ్రాంటును ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి కేంద్రం రాష్ట్రానికి సోమవారం నాడు విడుదల చేసినట్లు వైద్యారోగ్య శాఖా మంత్రి సత్యకుమార్ యాదవ్ నేడొక పత్రికా ప్రకటనలో వెల్లడించారు. దేశంలో ఆరోగ్య రంగానికి రాష్ట్రాల వారీగా కేటాయించబడిన 15వ ఆర్థిక సంఘం నిధులను పూర్థి స్థాయిలో సాధించిన ఘనత రాష్ట్రానికి దక్కిందని, ఇది సంతోషించదగిన విషయమని మంత్రి తెలిపారు. ఇప్పటి వరకు తమిళనాడు, త్రిపుర రాష్ట్రాలే ఈ ఘనతను దక్కించుకున్నాయని ఆయన వివరించారు.
ఆయుష్మాన్ ఆరోగ్య కేంద్రాలు, గ్రామీణ మరియు పట్టణ ప్రాంతాల్లో ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, సామాజిక ఆరోగ్య కేంద్రాలకు అవసరాల మేరకు భవనాల నిర్మాణం, డయాగ్నోస్టిక్ సేవలను మెరుగుపర్చడానికి, బ్లాక్ లెవల్ పబ్లిక్ హెల్త్ లేబరెటరీల ఏర్పాటుకు 15వ ఆర్థిక సంఘం నిధులను వినియోగిస్తారు.
2025-26 బడ్జెట్ సమీక్ష
ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి(2025-26) వైద్యారోగ్య శాఖకు కేటాయించబడిన నిధులు, మొదటి 3 త్రైమాసికాల్లో ( ఏప్రిల్ -డిసెంబర్ 2025) జరిగిన ఖర్చులకు సంబంధించి మంత్రి సత్యకుమార్ యాదవ్ సోమవారం సాయంత్రం లోతుగా సమీక్షించారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు వివిధ పథకాల కింద కేంద్ర సాయాన్ని పూర్తిస్థాయిలో సాధించడానికి ఆఖరి త్రైమాసికంలో గట్టి కృషి చేయాలని, కేంద్ర నిధులు పొందడంలో ఏమేరకు విఫలమైనా సంబంధిత అధికారులను బాధ్యుల్ని చేయాల్సి ఉంటుందని మంత్రి స్పష్టం చేశారు. ఈ దిశగా వివిధ పథకాల కింద రావాల్సిన కేంద్ర సాయం, ఇప్పటి వరకు జరిగిన వ్యయం, ఆఖరి త్రైమాసికంలో రావాల్సి ఉన్న కేంద్ర నిధుల గురించిన సమగ్ర సమాచారంతో త్వరలో మరోసారి సమీక్షిస్తానని మంత్రి స్పష్టం చేశారు.
ఫలించిన వైద్యారోగ్య శాఖ కృషి
సోమవారంనాటి సమీక్ష సందర్భంగా 15వ ఆర్థిక సంఘం సిఫారసుల మేరకు మంత్రిత్వ శాఖకు లభించిన నిధులు, ఇంకా రావాల్సిన నిధుల గురించి, ఇప్పటి వరకు వచ్చిన నిధుల వినియోగం గురించి మంత్రి సత్యకుమార్ యాదవ్ ఆరా తీశారు.
వైద్యారోగ్య శాఖకు 2021-22 నుండి 2025-26 వరకు మొత్తం రూ. 2,600 కోట్ల 15వ ఆర్థిక సంఘం నిధులు రావాల్సి ఉండగా సోమవారం నాటికి ఇంకా రూ.567.40 కోట్లు విడుదల కావాల్సి ఉందని అధికారులు తెలిపారు. నిధుల విడుదలలో జాప్యాన్ని గురించి ఆరా తీసి చివరి విడత నిధుల తక్షణ విడుదల కోసం కేంద్ర ఆర్థిక శాఖతో చర్చించాలని సీనియర్ అధికారులను మంత్రి ఆదేశించారు.
సోమవారం వరకు రూ. 2,033 కోట్ల మేరకు 15వ ఆర్థిక సంఘం నిధులు విడుదలయ్యాయని, అందులో రూ.1,896 కోట్ల మేరకు వ్యయం జరిగిందని అధికారులు తెలిపారు. మొత్తం విడుదలైన నిధుల్లో రూ. 1,108 కోట్లు(43 శాతం) 19 నెలల కూటమి ప్రభుత్వ హయాంలోనే వచ్చాయని, గత ప్రభుత్వ హయాంలో 57 శాతం మాత్రమే వచ్చాయని అధికారులు వివరించారు. అదే రీతిన ఇప్పటి వరకు జరిగిన రూ.1,896 కోట్ల ఖర్చులో రూ. 902 కోట్లు (48 శాతం) కూటమి ప్రభుత్వ హయాంలోనే జరిగిందని అధికారులు తెలిపారు.
తగు ప్రతిపాదనలతో నిధులు
సాధించడంలోనూ, వాటి వినియోగంలోనూ వైద్యారోగ్య శాఖ మంచి పనితీరు కనపరిచినందున మిగిలిన నిధుల విడుదల కోసం కేంద్ర ఆర్థిక శాఖతో తక్షణమే చర్చించాల్సిన అవసరాన్ని మంత్రి తెలిపారు.
యాధృచ్చికంగా మంత్రి నిర్వహించిన బడ్జెట్ సమీక్షా సమావేశం సోమవారం నాడు సాయంత్రం 6 గంటలకు ముగియగా అనంతరం అర గంటలో 15వ ఆర్థిక సంఘం ఆఖరి విడత నిధులను కేంద్రం రాష్ట్రానికి విడుదల చేసినట్లు సమాచారం లభించడంతో మంత్రి ఆనందాన్ని వ్యక్తం చేశారు.
నిధుల వినియోగం తీరు
పూర్తి గ్రాంటుగా లభించే 15వ ఆర్థిక సంఘం నిధులను పూర్తి స్థాయిలో సాధించడంలో గత ప్రభుత్వ హయాంలో కొంత వెనుకబాటుతనాన్ని గుర్తించిన మంత్రిత్వ శాఖ గత 19 నెలలుగా ఈ దిశగా దృష్టి సారించింది. ఈ నిధుల సద్వినియోగం కోసం ఎన్డీఏ ప్రభుత్వం భారీ స్థాయిలో ఆయుష్మాన్ ఆరోగ్య మందిరాలు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, సామాజిక ఆరోగ్య కేంద్రాలు, బిహెచ్‌పియల్ నిర్మాణాలను చేపట్టింది.
1,467 ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్ భవనాలు, 100 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, 7 సామాజిక ఆరోగ్య కేంద్రాలకు భవనాల నిర్మాణాన్ని వైద్యారోగ్య శాఖ చేపట్టింది. గతంలో చేపట్టబడి జాప్యానికి గురైన నిర్మాణ పనులను శీఘ్రతరం చేసింది. పర్యవసానంగా కూటమి ప్రభుత్వ హయాంలో 15వ ఆర్థిక సంఘం నిధుల వినియోగం బాగా పెరగడంతో సంతృప్తి చెందిన కేంద్ర ప్రభుత్వం ఆఖరి విడతగా రూ. 567.40 కోట్లను సోమవారంనాడు విడుదల చేసిందని మంత్రి సత్యకుమార్ యాదవ్ తెలిపారు. ఈ నిధులను ఆమోదించబడిన అవసరాల మేరకు సద్వినియోగం చేస్తామని మంత్రి అన్నారు.
నిధుల కేటాయింపులు
సోమవారంనాడు విడుదలైన 15వ ఆర్థిక సంఘం నిధుల్లో రూ.233.45 కోట్లను ఆయుష్మాన్ ఆరోగ్య మందిరాలు, ప్రాథమిక మరియు సామాజిక ఆరోగ్య కేంద్రాల భవనాల నిర్మాణానికి కేటాయించారు. రూ. 218.11 కోట్లను ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు మరియు ఆయుష్మాన్ ఆరోగ్య మందిరాల్లో వ్యాధి నిర్ధారణకు అవసరమైన మౌలిక సదుపాయాల అభివృద్ధికి నిర్దేశించారు. రూ. 55.89 కోట్లను గ్రామీణ ప్రాంతాల్లో హెల్త్ అండ్ వెల్నెస్ సెంటర్ల ఏర్పాటుకు కేటాయించారు. ఈ సేవలను పట్టణ ప్రాంతాల్లో అందించడానికి రూ. 52.71 కోట్లను ఖర్చు చేస్తారు.
15వ ఆర్థిక సంఘం నిధుల్లో రాష్ట్ర వాటా
రాష్ట్రాల జనాభా మరియు అభివృద్ధి సూచికల ఆధారంగా 15వ ఆర్థిక సంఘం నిధులను వివిధ రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు కేటాయిస్తారు. ఈమేరకు మొత్తం నిధుల్లో ఆంధ్రప్రదేశ్ వాటా 3.93 శాతమని అధికారులు మంత్రి సత్యకుమార్ యాదవ్‌కు తెలిపారు.