ఆంధ్రప్రదేశ్‌లో పీఎం శ్రీ స్కీమ్ కింద మరిన్ని స్కూళ్ల స్థాపనకు అవకాశం ఇవ్వాలని కేంద్ర మానవ వనరుల శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రదాన్‌ను ఏపీ విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ కోరారు. ఢిల్లీలోని ధర్మేంద్ర ప్రదాన్ నివాసంలో లోకేశ్ మర్యాదపూర్వకంగా కలిశారు. పీఎం శ్రీ ఫేజ్-1, 2లలో కలిపి ఏపీలో ప్రతిపాదించిన 2,369 పాఠశాలలకు 855 మాత్రమే మంజూరు అయినట్లు చెప్పారు. గతంలో సిఫార్సు చేసి మిగిలిన 1,514 పాఠశాలలను ఫేజ్-3లో మంజూరు చేయాలని కోరారు.
అదే విధంగా ఈ ఏడాది ఆగస్టులో నిర్వహించే అఖిల భారత విద్యా మంత్రుల సమ్మేళనం కార్యక్రమాన్ని ఏపీలో ఏర్పాటు చేసే అవకాశం కల్పించాలని కోరారు. విద్యారంగంలో కీలక సంస్కరణలపై చర్చించడానికి ఈ కన్‌క్లేవ్ ఒక వేదికగా ఉపయోగపడుతుందని వివరించారు. కేజీబీవీలు, స్కిల్ ఎడ్యుకేషన్, ఐటీ ఆధారిత అభ్యాసం, నాణ్యత పెంపుదలకు కేంద్రం నుంచి నిధులు కేటాయించాలని కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రదాన్‌ను ఈ సందర్భంగా కోరారు. రీసెర్చ్, ఇన్నోవేషన్, అకడమిక్ ఎక్సలెన్స్ హబ్‌గా ఏపీని తీర్చిదిద్దేందుకు పూర్వోదయ పథకం కింద రూ.5,684 కోట్లు మంజూరు చేయాలని నారా లోకేశ్ రిక్వెస్ట్ చేశారు.