ఎన్నికల నియమావళి కేసులో మెగాస్టార్ చిరంజీవికి ఊరట కలిగింది. 2014 ఎన్నికల సమయంలో చిరంజీవిపై నమోదైన కేసును ఏపీ హైకోర్టు నేడు కొట్టివేసింది. అప్పట్లో, ఎన్నికల కోడ్ ను ఉల్లంఘించారంటూ చిరంజీవిపై కేసు నమోదైంది. నిర్ణీత సమయం దాటి సభను నిర్వహించారంటూ చిరంజీవిపై అభియోగాలు మోపారు. ఆ సభ వల్ల ట్రాఫిక్ సమస్యలు వచ్చాయని కేసు నమోదు చేశారు. తొమ్మిదేళ్ల నాటి ఈ కేసుపై చిరంజీవి హైకోర్టును ఆశ్రయించారు. విచారణ జరిపిన న్యాయస్థానం కేసును కొట్టివేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.
2014 సార్వత్రిక ఎన్నికల వరకూ చిరంజీవి రాజకీయంగా యాక్టివ్ గా ఉన్నారు. ఆ సమయంలో ఏపీలో కాంగ్రెస్ పార్టీ తరఫున ఆయన ఎన్నికల ప్రచారం నిర్వహించారు. కాంగ్రెస్ పార్టీ తరఫున రాజ్యసభ ఎంపీగా ఎన్నికై, ఆ తర్వాత కేంద్రమంత్రి కూడా అయిన చిరంజీవిని 2014 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి స్టార్ క్యాంపెయినర్ గా పని చేశారు. అదే సమయంలో గుంటూరులో ఎన్నికల నియమావళి ఉల్లంఘనపై చిరంజీవిపై కేసు నమోదైంది. అప్పట్లో గుంటూరు పోలీసులు ఎన్నికల ప్రచారం సందర్భంగా చిరంజీవి ఎన్నికల నియమావళిని ఉల్లంఘించారంటూ కేసు పెట్టారు. కానీ ప్రాసిక్యూషన్ దీన్ని హైకోర్టులో నిరూపించలేకపోవడంతో కేసు కొట్టేస్తున్నట్లు రాష్ట్ర అత్యున్నత న్యాయస్ధానం ప్రకటించింది.