ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాష్ట్రాన్ని ప్రపంచ పర్యాటక కేంద్రంగా మార్చడానికి, పర్యాటక రంగంలో స్థిరమైన వృద్ధిని తీసుకుని రావడానికి, పెట్టుబడులను ఆకర్షించడానికి ఒక ప్రతిష్టాత్మక రోడ్‌మ్యాప్‌ను ఆవిష్కరించింది. హెలికాప్టర్ టూరిజం, టెంట్ సిటీల అభివృద్ధి, హోమ్ స్టేలు వంటి కార్యక్రమాలతో పాటు పర్యాటకాన్ని ప్రోత్సహించడానికి వినూత్న పథకాలను ప్రవేశపెట్టడానికి ఒక కార్యాచరణ ప్రణాళికను కూడా సిద్ధం చేస్తున్నట్లు స్పెషల్ చీఫ్ సెక్రటరీ (హౌసింగ్ మరియు టూరిజం) అజయ్ జైన్ తెలిపారు.
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రారంభించిన మిషన్ లైఫ్ ను అమలు చేయడానికి, కేంద్ర ప్రభుత్వ బ్యూరో ఆఫ్ ఎనర్జీ ఎఫిషియెన్సీ (BEE), విద్యుత్ మంత్రిత్వ శాఖ పరిధిలోని కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థల జాయింట్ వెంచర్ అయిన ఎనర్జీ ఎఫిషియెన్సీ సర్వీసెస్ లిమిటెడ్ (EESL)తో రాష్ట్రం సన్నిహిత సహకారంతో ఏపీ ప్రభుత్వం పనిచేస్తోందని ఆయన అన్నారు. అమరావతి, పోలవరం, విశాఖపట్నం, గండికోట, తిరుపతి, భోగాపురం ప్రాంతాలలో మొదటి దశలో ₹3,887 కోట్ల విలువైన 15 పర్యాటక ప్రాజెక్టులకు రాష్ట్ర పెట్టుబడి ప్రోత్సాహక బోర్డు అనుమతి ఇచ్చిందని అజయ్ జైన్ తెలిపారు.
మౌలిక సదుపాయాలను బలోపేతం చేయడానికి, ప్రపంచ అంచనాలను అందుకోవడానికి, విశాఖపట్నం, తిరుపతిలలో ప్రపంచ స్థాయి హోటళ్లను ఏర్పాటు చేయడానికి ఒబెరాయ్, మేఫెయిర్, ఐఆర్‌సిటిసి వంటి ప్రముఖులతో కొత్త ఒప్పందాలు కుదుర్చుకున్నామని అజయ్ జైన్ అన్నారు. రాబోయే నాలుగు సంవత్సరాలలో రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలలో 25,000 మందికి పైగా ప్రత్యక్ష, పరోక్ష ఉపాధిని పర్యాటకం సృష్టించాలని ముఖ్యమంత్రి ఆదేశించారన్నారు.