సినిమా టికెట్ల విషయంలో మరో కీలక నిర్ణయం తీసుకున్న ఏపీ ప్రభుత్వం
AP Govt Take Key Decision On Movie Tickets. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జులై 8 నుండి సినిమా థియేటర్లు ఓపెన్ అవ్వబోతూ ఉన్నాయి.
By Medi Samrat Published on 7 July 2021 10:00 AM GMTఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జులై 8 నుండి సినిమా థియేటర్లు ఓపెన్ అవ్వబోతూ ఉన్నాయి. ఇలాంటి సమయంలో సినిమా టికెట్ల రేట్ల విషయంలో ఉన్న గందరగోళాన్ని తెర దించుతూ ఏపీ ప్రభుత్వం కీలక ప్రకటన జారీ చేసింది. రాష్ట్రంలోని సినిమా థియేటర్ల టికెట్ల ధరలు ఇక రద్దీ ఆధారంగా మారతాయని రాష్ట్ర హోం శాఖ మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఇక నుంచి ప్రభుత్వ ఆదేశాల మేరకు మాత్రమే సినిమా హళ్లలోని వివిధ కేటగిరీల టికెట్ ధరల్ని నిర్ణయించాలని ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు సినిమా నియంత్రం చట్టం 1955 ప్రకారం జారీ చేసిన 1273 జీవోను సవరిస్తూ నోటిఫికేషన్ విడుదల చేసింది.
ఏపీ, తెలంగాణలో పెద్ద సినిమాలకు అదనపు ఆటలు, రెండు వారాల వరకూ రెట్టింపు ధరలు అనుమతివ్వాలని ఎగ్జిబిటర్లు ప్రభుత్వానికి విన్నవించడం లేదా కోర్టు నుంచి అనుమతి తెచ్చుకోవడం జరుగుతోంది. మిగతా సమయాల్లో ప్రభుత్వ ఫిక్స్‌డ్ ధరలు ఏ, బీ, సీ సెంటర్లలో ఉంటాయి. ఇకపై రాష్ట్రంలో ఈ సమస్య లేకుండా ఎప్పటికప్పుడు ప్రభుత్వం అనుమతి ఇవ్వనుంది.
జూలై 8వ తేదీ నుంచి రెండు తెలుగు రాష్ట్రాల్లో థియేటర్లు పున: ప్రారంభం కానున్నాయి. 50 శాతం సీటింగ్ సామర్ధ్యంతో సీటుకు సీటుకు మధ్య గ్యాప్‌తో ఏపీలో ఓపెన్ అవుతుండగా.. తెలంగాణలో 100 శాతం సీటింగ్ క్యాపాసిటీతో తెరుచుకోనున్నాయి. ఏపీ సినిమా నియంత్రణ చట్టం 1955 ప్రకారం జారీ చేసిన జీవోను సవరిస్తూ కీలక ఉత్తర్వులు జారీ చేసింది. ఏప్రిల్ లో పవన్ కళ్యాణ్ నటించిన వకీల్ సాబ్ విడుదల సమయంలో టిక్కెట్ల రేట్లు పెంచుకొనేందుకు ఎగ్జిబిటర్లు ప్రభుత్వాన్ని కోరారు. ప్రభుత్వం అందుకు అనుమతి లభించలేదు. ఎగ్జిబిటర్లు హైకోర్టుకు వెళ్లగా తాత్కాలిక ఉప శమనం లభించింది. ఎగ్జిబిటర్లు గతంలో ఉన్న విధంగానే కొత్త సినిమాలు..ప్రముఖ హీరోల సినిమాల బెనిఫిట్ షో లకు అనుమతి ఇవ్వాలని..టిక్కెట్ల ధరల విషయంలోనూ సడలింపు ఇవ్వాలని కోరుతున్నప్పటికీ ఏపీ ప్రభుత్వం అందుకు ఒప్పుకోలేదు.