ఏపీలో రాత్రి కర్ఫ్యూ ఎత్తివేత.. ప్రకటించిన సీఎం జగన్
AP Govt lifts night curfew. ఏపీలో రాత్రి కర్ఫ్యూను ఎత్తివేస్తూ సీఎం జగన్ సర్కార్ నిర్ణయం తీసుకుంది. కరోనా వ్యాప్తి తగ్గినందున రాత్రి
By అంజి Published on 14 Feb 2022 9:00 PM ISTఏపీలో రాత్రి కర్ఫ్యూను ఎత్తివేస్తూ సీఎం జగన్ సర్కార్ నిర్ణయం తీసుకుంది. కరోనా వ్యాప్తి తగ్గినందున రాత్రి కర్ఫ్యూను ఎత్తివేస్తున్నట్లు సీఎం వైఎస్ జగన్ ప్రకటించారు. అయితే కొవిడ్ మార్గదర్శకాలు అమల్లో ఉంటాయని, వాటిని కచ్చితంగా అమలు చేయాలని అధికారులకు సీఎం జగన్ ఆదేశాలిచ్చారు. కాగా వైద్యారోగ్య శాఖ చేపట్టిన ఉద్యోగ నియామక ప్రక్రియను త్వరగా పూర్తి చేయాలని సీఎం జగన్ ఆదేశాలు జారీ చేశారు. అంతకుముందు రాష్ట్రంలో కరోనా పరిస్థితులపై సీఎం జగన్ సమీక్ష చేపట్టారు. ఈ సమావేశంలో డిప్యూటీ సీఎం ఆళ్ల నాని, సీఎస్ సమీర్ శర్మ, వైద్య ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి అనిల్ కుమార్ సింఘాల్, ఇతర అధికారులు హాజరయ్యారు.
రాష్ట్రంలో కరోనా కేసులు సంఖ్య గణనీయంగా తగ్గిందని సీఎం జగన్‌కు అధికారులు తెలిపారు. ప్రస్తుతం యాక్టివ్ కేసుల రేటు 0.82 శాతానికి పడిపోయింది. షాపులు, వ్యాపార భవనాల్లో కొవిడ్ మార్గదర్శకాలు కచ్చితంగా పాటించాలని, రాత్రి కర్ఫ్యూను ఎత్తివేసిన ప్రజలు తప్పనిసరిగా మాస్క్‌లు ధరించాలని ఆదేశించారు. ఫీవర్ సర్వే కొనసాగింపుతో పాటు, లక్షణాలు కనిపించిన వారికి కరోనా పరీక్షలు చేయాలని సీఎం జగన్ ఆదేశాలిచ్చారు. రాష్ట్రంలో ఇప్పటి వరకు 3,90,83,148 మంది రెండు డోసులు వ్యాక్సిన్ ఇచ్చారు. అలాగే 39, 04,927 మందికి ఒక డోసు వ్యాక్సిన్ వేశారు. వ్యాక్సినేషన్ ప్రక్రియ ముమ్మరంగా కొనసాగించాలని అధికారులకు సీఎం జగన్ ఆదేశం ఇచ్చారు. సిబ్బంది తప్పనిసరిగా ఆస్పత్రుల్లో ఉండటంతో పాటు ఆస్పత్రుల్లో అడ్మినిస్ట్రేషన్, చికిత్స బాధ్యతలను వేరు చేయాలన్నారు.