తెలంగాణ ప్రభుత్వంపై ఏపీ ప్రభుత్వం సుప్రీం కోర్టును ఆశ్రయించింది. రాష్ట్ర విభజన జరిగినా ఉమ్మడి ఆస్తుల విభజన ఇంకా జరగలేదని.. ఈ విషయంలో తెలంగాణ ప్రభుత్వం సహకరించడం లేదని ఆరోపిస్తూ పిటిషన్ దాఖలు చేసింది. ఉమ్మడి ఆస్తుల విలువ రూ. 1, 42, 601 కోట్లు ఉందని.. దాన్ని విభజించలేదని ఏపీ ప్రభుత్వం సుప్రీంకోర్టుకు తెలిపింది. తెలంగాణనే కాలయాపన చేస్తోందని విభజన జరగాల్సిన ఆస్తులు 91 శాతం హైదరాబాద్‌లోనే ఉన్నాయన్నారు. విభజన జరిగి ఎనిమిది ఏళ్లవుతున్నా, ఆస్తుల విభజనకు తెలంగాణ సర్కార్ సహకరించడం లేదన్నారు.
రాజ్యాంగంలోని ఆర్టికల్ 14, 21 ప్రకారం ఏపీ ప్రజల హక్కులకు తెలంగాణ భంగం కలిగించిందని ఏపీ ప్రభుత్వం పిటిషన్‌లో పేర్కొంది. ఆస్తుల విభజన త్వరగా జరిగేలా ఆదేశాలివ్వాలని కోరింది. తెలంగాణ హైకోర్టులోనూ ఏపీ ప్రభుత్వం ఓ పిటిషన్ దాఖలు చేసింది. విభజన చట్టం ప్రకారం విద్యుత్ బకాయిలు చెల్లించకపోవడంతో అప్పటి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం.. నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్‌లో కేసు వేసింది. తెలంగాణ జెన్కోను దివాలా దీసినట్లుగా ప్రకటించి తమకు రావాల్సిన నిధులు తమకు ఇప్పించాలని కోరింది. అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఎన్సీఎల్టీలో పిటిషన్ ఉపసంహరించుకుంది.