అమరావతికి చట్టబద్ధత సరే..నిధుల మాటేంటి? కూటమి ప్రభుత్వాన్ని నిలదీసిన షర్మిల

అమరావతిని ఆంధ్రప్రదేశ్ ఏకైక చట్టబద్ధ రాజధానిగా గుర్తిస్తూ అసెంబ్లీలో తీర్మానం చేయడాన్ని ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల స్వాగతించారు

By -  Knakam Karthik
Published on : 28 March 2026 3:10 PM IST

Andrapradesh, Amaravati, YS Sharmila, AP Capital, AP Politics, Congress, Central Funds, Amaravati Funds, AP Assembly

అమరావతికి చట్టబద్ధత సరే..నిధుల మాటేంటి? కూటమి ప్రభుత్వాన్ని నిలదీసిన షర్మిల

అమరావతిని ఆంధ్రప్రదేశ్ ఏకైక చట్టబద్ధ రాజధానిగా గుర్తిస్తూ అసెంబ్లీలో తీర్మానం చేయడాన్ని ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల స్వాగతించారు. అయితే, కేవలం గెజిట్ నోటిఫికేషన్‌లో పేరు ఉంటేనే సరిపోదని, రాజధాని నిర్మాణానికి అవసరమైన సుమారు లక్ష కోట్ల నిధులు ఎక్కడి నుంచి వస్తాయని ఆమె రాష్ట్ర ప్రభుత్వాన్ని సూటిగా ప్రశ్నించారు.

విభజన చట్టంలోని సెక్షన్ 94(3) ప్రకారం నూతన రాజధాని నిర్మాణ బాధ్యత పూర్తిగా కేంద్రానిదేనని గుర్తు చేసిన ఆమె, ఎంత ఖర్చయినా కేంద్రమే భరించాల్సి ఉన్నప్పుడు రాష్ట్ర ప్రభుత్వం ఆ హక్కును ఎందుకు వదిలేస్తోందని నిలదీశారు. కేంద్రం ఇస్తున్న అప్పులను 'ముష్టి'గా అభివర్ణించిన షర్మిల, మన హక్కుగా రావాల్సిన నిధుల సాధన కోసం అసెంబ్లీలో తీర్మానం ఎందుకు చేయడం లేదని మండిపడ్డారు.

గతంలో ప్రధాని మోదీ అమరావతికి 'చెంబుడు నీళ్లు, తట్టెడు మట్టి' ఇచ్చారని విమర్శిస్తూ, బీజేపీ ఇస్తున్న అరకొర సాయంతోనే సంతృప్తి చెందుదామా అని ఆమె ఘాటు వ్యాఖ్యలు చేశారు. నిధుల గురించి కేంద్రాన్ని ఒత్తిడి చేయకుండా, కేవలం చట్టబద్ధత పేరుతో కాలక్షేపం చేస్తూ రాజధాని నిర్మాణ భారాన్ని ప్రజలపై వేయడం సరికాదని ఆమె స్పష్టం చేశారు.

భవిష్యత్తులో జగన్ వంటి వారు వచ్చినా రాజధానిని మార్చలేని విధంగా ముఖ్యమంత్రి చంద్రబాబు విజన్ ఉండొచ్చు కానీ, నిధులు లేకుండా అమరావతి కల సాకారం కాదని షర్మిల అభిప్రాయపడ్డారు. ఈ విషయంలో కూటమి ప్రభుత్వం రాష్ట్ర ప్రజలకు స్పష్టమైన సమాధానం చెప్పాలని ఆమె డిమాండ్ చేశారు.

Next Story