ఉగాది రోజున మరో 5.9 లక్షల గృహ ప్రవేశాలు.. సీఎం గుడ్‌న్యూస్
రాష్ట్ర వ్యాప్తంగా 3 లక్షల ఇళ్ళ పంపిణీ అనంతరం ప్రజావేదిక సభలో ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రసంగించారు.
By - Medi Samrat |
రాష్ట్ర వ్యాప్తంగా 3 లక్షల ఇళ్ళ పంపిణీ అనంతరం ప్రజావేదిక సభలో ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రసంగించారు. పేదలకు న్యాయం చేయడం కోసం అనునిత్యం పని చేస్తామన్నారు. గృహ నిర్మాణాలకు కేంద్రం ఇచ్చే డబ్బులే కాకుండా రాష్ట్ర ప్రభుత్వం నుంచి కూడా ఇస్తున్నామని తెలిపారు. పట్టణాల్లో కేంద్రం రూ.2.5 లక్షలు, గ్రామీణ ప్రాంతాల్లో రూ.2 లక్షలు ఇస్తోంది. దీనికి అదనంగా బీసీ, ఎస్సీలకు రూ.50 వేలు, ఎస్టీలకు రూ.75 వేలు, ప్రిమిటివ్ గిరిజనులకు రూ.1 లక్ష ఇప్పటికే ఇస్తున్నామన్నారు. ఇకపై గృహ నిర్మాణాలకు బీసీ, ఎస్సీలకు ఇచ్చినట్టే ముస్లింలకు కూడా రూ.50 వేలు అదనంగా ఇస్తామని తెలిపారు. దాదాపు 6 లక్షల మంది ఇళ్లు కట్టుకునే స్థోమత లేక నిర్మాణాలు నిలిపేశారు. వీరికి ప్రభుత్వం అందించే సాయం కారణంగా రూ.3,220 కోట్లు ఖర్చు అవుతుందన్నారు. బీసీల్లో 3.75 లక్షల కుటుంబాలకు, ఎస్సీల్లో 1.57, ఎస్టీలకు 46వేలు, 22 వేల ఆదివాసీ కుటుంబాలకు లబ్ధి చేకూరనుందని వివరించారు.
ఉగాది రోజున మరో 5.9 లక్షల గృహ ప్రవేశాలు చేయిస్తామని గుడ్‌న్యూస్ చెప్పారు. ఇల్లు లేని పేదలను గుర్తిస్తున్నాం. అర్హులు తమ పేర్లను నమోదు చేసుకోవాలని సూచించారు. ఉమ్మడి కుటుంబాలను ప్రోత్సహిస్తున్నాం.. కుటుంబ పెద్దలకు, వారి కుమారులకు కలిపి కూడా ఉమ్మడి ఇల్లు నిర్మిస్తామన్నారు. కుటుంబం కలిసి ఉండాలి.. కలిసుంటేనే కలదు సుఖం. విడిపోతే అన్నీ సమస్యలేనన్నారు. సొంత స్థలం ఉన్నవారి ఇళ్ల నిర్మాణానికి సహకరిస్తాం.. లేని వారికి స్థలం కేటాయిస్తామన్నారు. పట్టణ ప్రాంతాల్లోని వారికి 1 ప్లస్ 2, 3 విధానంలో అపార్టమెంట్ కట్టి సదుపాయాలు కల్పిస్తామన్నారు. ప్రతి ఇంటికి కరెంట్ ఇస్తాం.. ఇంటిపైనే కరెంట్ తయారు చేసుకునేందుకు సోలార్ ఏర్పాటు చేస్తామన్నారు. ఎస్టీ, ఎస్సీలకు ఉచితంగా ఏర్పాటు చేస్తాం. బీసీలకు సబ్సిడీ ఇస్తామని తెలిపారు. ప్రతి ఇంటికి ఇంటర్నెట్ సౌకర్యం ఉండాలి.. మీరు ఏ పని కావాలన్నా ఇంటి నుంచే చేయాలన్నారు.
మన ఇంటిపైనుంచే విద్యుత్ ఉత్పత్తి చేసుకునే అవకాశం ఏర్పడింది. రైతులు ముందుకొచ్చి విద్యుత్ తయారు చేస్తామంటే.. సోలార్ ప్యానెళ్లు పెట్టుకుని తయారు చేసుకోవచ్చు.. పంపుసెట్లకు పోను మిగిలిన విద్యుత్ గ్రిడ్ కొనుగోలు చేస్తుంది.. విద్యుత్ వినియోగదారులు ఉత్పత్తి దారులుగా మారాలని పిలుపునిచ్చారు. నా తల్లి పడ్డ కష్టాలు చూసి ముఖ్యమంత్రి అయ్యాక దీపం పథకం పెట్టాను.. దేశంలో ఎక్కడా లేని విధంగా గ్యాస్ కనెక్షన్లు ఇచ్చాను.. ఇప్పుడు దీపం-2.0 పథకం కింద మూడు సిలిండర్లు ఉచితంగా ఇస్తున్నామన్నారు.