ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన జరిగిన ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గం కీలక నిర్ణయాలు తీసుకుంది. ఈ భేటీలో అమరావతి పునర్నిర్మాణ పనులు ప్రారంభించిన ప్రధాని నరేంద్ర మోదీకి మంత్రివర్గం ధన్యవాదాలు తెలిపింది. 47వ సీఆర్డీఏ సమావేశంలో తీసుకున్న నిర్ణయాలకు ఆమోదముద్ర వేసింది. రాజధాని పరిధిలో వివిధ సంస్థలకు భూకేటాయింపులకు ఆమోదం తెలిపింది. తల్లికి వందనం, అన్నదాత సుఖీభవ తదితర సంక్షేమ కార్యక్రమాలపై చర్చించింది. తీరప్రాంత భద్రత, రక్షణ రంగ పరిశ్రమల వద్ద జాగ్రత్తలు వంటి అంశాలపై సమీక్ష నిర్వహించింది.
ఆపరేషన్ సిందూర్ నిర్వహించిన త్రివిధ దళాలకు క్యాబినెట్ అభినందనలు తెలిపింది. ఏపీ పునర్విభజన చట్టంలో అమరావతి పేరు చేర్చే ప్రతిపాదనకు ఆమోదం తెలిపింది. ఏపీ రాజధాని స్థానంలో అమరావతి పేరు చేర్చే ప్రతిపాదనకు క్యాబినెట్ ఆమోదం తెలిపింది. మత్స్యకారులకు వేట నిషేధ సమయంలో ఆర్థిక సాయం పెంపు, రాష్ట్రంలో పర్యాటక అభివృద్ధికి మెగా ఈవెంట్స్ నిర్వహించే ప్రతిపాదనకు అంగీకారం తెలిపింది. మున్సిపల్ శాఖ 281 పనులను హైబ్రిడ్ యాన్యూటీ విధానంలో చేపట్టేందుకు ఆమోదం తెలిపింది. కేంద్రం వద్ద పెండింగ్‌లో ఉన్న 3 బిల్లులను వెనక్కి తీసుకునే ప్రతిపాదనకు అంగీకరించింది.