ఎరువుల కొరత ఉండదు.. ఆందోళన వ‌ద్దు : మంత్రి అచ్చెన్నాయుడు

రాష్ట్రంలో రైతులకు ఎరువుల కొరత ఉండదని వ్యవసాయ శాఖ మంత్రి కింజ‌రాపు అచ్చెన్నాయుడు హామీ ఇచ్చారు.

By Medi Samrat
Published on : 25 Aug 2025 4:54 PM IST

ఎరువుల కొరత ఉండదు.. ఆందోళన వ‌ద్దు : మంత్రి అచ్చెన్నాయుడు

రాష్ట్రంలో రైతులకు ఎరువుల కొరత ఉండదని వ్యవసాయ శాఖ మంత్రి కింజ‌రాపు అచ్చెన్నాయుడు హామీ ఇచ్చారు. 2025 ఖరీఫ్ కోసం 31.15 లక్షల మెట్రిక్ టన్నుల ఎరువుల అంచనా వేశాం.. ఇప్పటివరకు 21.34 లక్షల మెట్రిక్ టన్నులు సరఫరా చేశామ‌ని తెలిపారు. యూరియా, డీఏపీ, ఎంఓపీ, ఎస్‌ఎస్‌పీ, కాంప్లెక్స్ కలిపి 6.22 లక్షల మెట్రిక్ టన్నుల ఎరువులు అందుబాటులో ఉన్నాయని.. ఎరువుల కొరత రాకుండా 1.10 లక్షల మెట్రిక్ టన్నుల బఫర్ స్టాక్ సిద్ధంగా ఉంద‌ని వెల్ల‌డించారు. గోదావరి వరదలతో సమస్యలు తలెత్తినా, ప్రభుత్వం ముందస్తు చర్యలు తీసుకుందన్నారు.

కేంద్రం ఇప్పటి వరకు 3.50 లక్షల మెట్రిక్ టన్నులు కేటాయించగా.. 1.30 లక్షల మెట్రిక్ టన్నులు చేరాయి.. 0.47 లక్షల మెట్రిక్ టన్నులు రాబోతున్నాయని తెలిపారు. ఆగస్టు నెలలో 1.65 లక్షల మెట్రిక్ టన్నులు కేటాయించగా.. అందులో 0.75 లక్షల మెట్రిక్ టన్నులు ఇప్పటికే రాష్ట్రానికి చేరాయి. మిగిలిన 0.90 లక్షల మెట్రిక్ టన్నులు గంగవరం, కాకినాడ, విశాఖపట్నం, ఒరిస్సా పోర్టుల ద్వారా త్వరలో చేరనున్నాయని తెలిపారు.

రైతులకు ఎరువులు పారదర్శకంగా, సమయానికి అందించేందుకు iFMS (Integrated Fertilizer Management System) ద్వారా పర్యవేక్షణ చేస్తున్నామ‌ని.. ప్రస్తుతం రాష్ట్రంలో 6.48 లక్షల మెట్రిక్ టన్నుల ఎరువులు అందుబాటులో ఉన్నాయని.. రైతులు ఎటువంటి ఆందోళన చెందవద్దని భ‌రోసా క‌ల్పించారు. మధ్యవర్తులు అధిక ధరలకు అమ్మే ప్రయత్నాలు చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామ‌ని హెచ్చ‌రించారు. నల్లబియ్యం, అరటి, చెరకు వంటి ప్రత్యేక పంటలకు ఎరువుల సరఫరా కోసం ప్రత్యేకంగా పర్యవేక్షణ జరుగుతోందన్నారు.

Next Story