రాష్ట్రంలో రైతులకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరో శుభవార్త చెప్పింది. సుదీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న నీటిపన్ను బకాయిలపై వడ్డీని మాఫీ చేస్తూ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. నీటి పన్ను బకాయిలపై వడ్డీ రూ.85.81 కోట్లను ఒకేసారి మాఫీ చేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు భూ పరిపాలనా శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి (ఎఫ్‌ఎసి) జి.జయలక్ష్మి గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. 2024-25 సంవత్సరం వరకూ సాగునీటి పన్నులకు సంబంధించిన బకాయిలపై వడ్డీని రద్దు చేస్తున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.
నీటితీరువా బకాయిలు ఇప్పటివరకు రూ.450 కోట్లపైనే ఉంటాయి. వీటిని రైతులు ఏటేటా చెల్లింస్తుండాలి. కొన్నేళ్లుగా వసూళ్లు సజావుగా సాగడం లేదు. 2024-25 నాటికి రైతులు చెల్లించాల్సిన వడ్డీ రూ.85.81 కోట్లు ఉంది. అయితే దీన్ని మాఫీ చేయాలని సీఎం చంద్రబాబు ఆదేశించారు. ఈ నేపథ్యంలో రెవెన్యూశాఖ చేసిన వడ్డీ మాఫీ ప్రతిపాదనను మంత్రివర్గ భేటీలో ఆమోదించారు.