ప్రతీ పోర్టుకూ కనెక్టివిటీ మాస్టర్ ప్లాన్
తూర్పు తీర మారిటైమ్ లాజిస్టిక్స్ గేట్ వేగా ఏపీ మారుతుందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు.
By Medi Samrat
తూర్పు తీర మారిటైమ్ లాజిస్టిక్స్ గేట్ వేగా ఏపీ మారుతుందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. ఉత్తరాది రాష్ట్రాలతో పాటు పొరుగు రాష్ట్రాలైన తెలంగాణా, మహారాష్ట్ర, చత్తీస్ ఘడ్, కర్ణాటక తదితర రాష్ట్రాల హింటర్ ల్యాండ్ కార్గోను కూడా ఏపీ పోర్టుల ద్వారా రవాణా చేసేలా కార్యాచరణ చేపడుతున్నామని వివరించారు. మంగళవారం విశాఖలో జీఎఫ్ఎస్టీ ఆధ్వర్యంలో జరిగిన ఈస్ట్ కోస్ట్ మారిటైమ్ లాజిస్టిక్స్ సమ్మిట్ కు సీఎం ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఏపీని లాజిస్టిక్స్ హబ్ గా తీర్చిదిద్దేందుకు కార్యాచరణ చేపడుతున్నామని సీఎం స్పష్టం చేశారు. ఈస్ట్ కోస్టు గేట్ వేగా ఏపీ అత్యుత్తమ ప్రదేశమని అన్నారు. సదస్సు కంటే ముందు మారిటైమ్ లాజిస్టిక్స్ అభివృద్ధిపై దేశవ్యాప్తంగా వివిధ పోర్టులు, కార్గో హ్యాండ్లింగ్ కంపెనీలకు చెందిన 62 మంది సీఈఓలతో ముఖ్యమంత్రి సమావేశమయ్యారు. రాష్ట్రంలో మారిటైమ్ లాజిస్టిక్స్ రంగంలో ఉన్న అవకాశాలు, పోర్టు కార్గో హ్యాండ్లిగ్ లో మౌలిక సదుపాయాల కల్పన, రోడ్డు, రైలు కనెక్టివిటి, ఓడరేవుల్లో టెర్మినళ్ల ఆధునీకరణ, షిప్ బిల్డింగ్, మారిటైమ్ లాజిస్టిక్స్ లో అంతర్జాతీయంగా అనుసరిస్తున్న ప్రమాణాలతో పాటు వివిధ అంశాలను ప్రతిపాదించారు. ప్రస్తుతం రాష్ట్రంలోని వివిధ పోర్టుల ద్వారా 69 మిలియన్ టన్నుల మేర ఇనుప ఖనిజం, 11 మిలియన్ టన్నుల బొగ్గు, 5.5 మిలియన్ టన్నుల ఎరువుల రవాణా జరుగుతోందని సీఎం తెలిపారు. బల్క్ కార్గో రవాణాకు భారీ నౌకలు రాకపోకలు సాగించేలా 18 మీటర్ల లోతైన ఓడరేవులు తూర్పుతీరంలో ఏపీ మినహా మరెక్కడా లేవన్నారు. సముద్ర రవాణా పరంగా ఏపీ దేశంలోనే రెండో స్థానంలో ఉందన్నారు. పోర్టులకు అనుసంధానంగా మూడు పారిశ్రామిక కారిడార్లు కూడా ఏపీలో ఉన్నాయని తెలిపారు. పొరుగు రాష్ట్రం తెలంగాణా డ్రైపోర్టును ఏర్పాటు చేసి మచిలీపట్నం ద్వారా కార్గో రవాణా చేయాలని భావిస్తోందని అన్నారు. గోదావరి నది ద్వారా అంతర్గత జల రవాణా మార్గాలతో మహారాష్ట్ర, కర్ణాటక కూడా ఏపీలోని కొన్ని పోర్టుల ద్వారా సరకు రవాణా చేయాలని భావిస్తున్నట్టు సీఎం స్పష్టం చేశారు. ఇవన్నీ ఏపీకి ఉన్న సానుకూలతలని తెలిపారు.
ప్రతీ పోర్టుకు కనెక్టివిటీ మాస్టర్ ప్లాన్
పోర్టులు, ఎయిర్ పోర్టులు, రహదారులు, రైలు మార్గాలను అనుసంధానించి ఇంటిగ్రేటెడ్ లాజిస్టిక్స్ వ్యవస్థను రూపొందిస్తామని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. వీటితో పాటు అంతర్గత జలరవాణా మార్గాలను కూడా అభివృద్ధి చేస్తామని వెల్లడించారు. గోదావరి, కృష్ణా నదుల ప్రవాహ మార్గాల్లో దాదాపు 1500 కిలోమీటర్ల మేర జల రవాణా మార్గాలను వినియోగించుకునేందుకు అవకాశం ఉందన్నారు. కాకినాడ-చెన్నైల మధ్య పురాతనమైన బకింగ్ హామ్ కెనాల్ రవాణా మార్గాన్ని పునరుద్ధరిస్తామని సీఎం తెలిపారు. ఈ రవాణా మార్గాలను అనుసంధానించటం ద్వారా అతి తక్కువ రవాణా వ్యయం సాధించేందుకు ఆస్కారం ఉంటుందన్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం ఆపరేషనల్ గా ఉన్న పోర్టులు, కొత్తగా అందుబాటులోకి రానున్న పోర్టులతో రహదారులు, రైలు మార్గాలు, అంతర్గత జలరవాణా, ఎయిర్ కార్గో మార్గాలను అనుసంధానించేలా ప్రతీ పోర్టుకూ కనెక్టివిటి మాస్టర్ ప్లాన్ రూపోందిస్తామని సీఎం వెల్లడించారు. రవాణా పరమైన అంశాలను నిర్వహించేందుకు వీలుగా ఏపీలో త్వరలోనే లాజిస్టిక్స్ కార్పోరేషన్ ఏర్పాటు చేస్తున్నామని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. తక్కువ వ్యయంతోనే రైలు, రోడ్డు మార్గాలను పోర్టులకు అనుసంధానించే అవకాశం ఉందని తెలిపారు.
పోర్టు ఆధారిత ఆర్ధిక వ్యవస్థ
పోర్టులకు అనుసంధానంగా పారిశ్రామిక కార్యకలాపాలతో పాటు టౌన్ షిప్ లను కూడా ఏర్పాటు చేసేలా ప్రణాళికలు రూపోందిస్తున్నామని సీఎం వివరించారు. మూలపేట, మచిలీపట్నం, కాకినాడ, రామాయపట్నం ఇలా వివిధ పోర్టుల వద్ద పరిశ్రమల ఏర్పాటు, టౌన్ షిప్ ల కోసం 10 వేల ఎకరాల భూమి కూడా అందుబాటులో ఉందన్నారు. ఆర్ధిక వ్యవస్థతో పాటు ఈ రంగాల్లో నైపుణ్యాలు, ఉద్యోగ అవకాశాలు మెరుగయ్యేలా లాజిస్టిక్స్ యూనివర్సిటీ, సివిల్ ఏవియేషన్ యూనివర్సిటీలు కూడా త్వరలో ఏర్పాటు అవుతాయని సీఎం తెలిపారు. విశాఖ, అమరావతి, తిరుపతి సహా రాష్ట్రంలోని వేర్వేరు ప్రాంతాల నుంచి ఎయిర్ కార్గో రవాణాకు కూడా అనువుగా ఏర్పాట్లు చేస్తామన్నారు. మొత్తంగా జీఎస్టీపీలో లాజిస్టిక్స్ రంగం 3 శాతానికి పెంచుకునేందుకు అవకాశం ఉందన్నారు. దుగరాజపట్నం సహా వివిధ ప్రాంతాల్లో షిప్ బిల్డింగ్ యూనిట్లు, మరమ్మత్తులు, కంటైనర్లు, షిప్ రీసైక్లింగ్ లాంటి పరిశ్రమల ఏర్పాటుకు అవకాశముందని సీఎం స్పష్టం చేశారు. మారిటైమ్ లాజిస్టిక్స్ కు సంబంధించి 15-20 మంది పారిశ్రామిక వేత్తలతో కూడిన సలహా బోర్డును కూడా ఏర్పాటు చేయనున్నట్టు ముఖ్యమంత్రి ప్రకటించారు. అంతకు ముందు మారిటైమ్ రంగంలోని ఆరు స్టార్టప్ కంపెనీలు ఏర్పాటు చేసిన స్టాళ్లను సీఎం పరిశీలించారు. ఎయిర్ కార్గో ఫోరం ఆఫ్ ఇండియా ఏపీ చాప్టర్ ను సీఎం ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో మంత్రులు బీసీ జనార్ధన్ రెడ్డి, డీబీవీ స్వామి, మారిటైమ్ బోర్డు ఛైర్మన్ దామచర్ల సత్య, ఆ సంస్థ అధికారులు, జీఎఫ్ఎస్టీ వైస్ చైర్మన్ ఎస్.పి.టక్కర్ తదితరులు హాజరయ్యారు.