ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం తీసుకుంది. మూడు రాజధానుల బిల్లును ఉపసంహరించుకున్నట్లు రాష్ట్ర హైకోర్టుకు అడ్వకేట్ జనరల్ తెలిపారు. మూడు రాజధానులు అంశంపై ఏపీ హైకోర్టులో గత కొద్దిరోజులుగా విచారణ జరుగుతోంది. ఇవాళ్టి వాదోపవాదాల్లో భాగంగా మూడు రాజధానుల బిల్లు ఉపసంహరించుకుంటున్నట్లు అడ్వకేట్ జనరల్ కోర్టుకు తెలిపారు. చట్టం రద్దుపై సీఎం జగన్ ప్రకటన చేస్తారని అడ్వొకేట్ జనరల్ తెలిపారు. ఇదే అంశంపై ఏపీ సచివాలయంలో కేబినెట్ సమావేశం అత్యవసరంగా సమావేశమైంది. మూడు రాజధానుల బిల్లును ఉపసంహరణ అంశంపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అసెంబ్లీలో ప్రకటన చేయనున్నారు.
2019 సెప్టెంబర్ 11న రాష్ట్ర సమగ్రభివృద్ధికి సంబంధించి జీఎన్ రావు కమిటీని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం నియమించింది. 2019 డిసెంబర్ 20న రాష్ట్ర పరిపాలన వికేంద్రీకరణకు సంబంధించి జీఎన్ రావు కమిటీ ప్రభుత్వానికి నివేదిక సమర్పించింది. 2019 డిసెంబర్ 29న జీఎన్ రావు కమిటీ అందించిన నివేదిల ఆధారంగా హైపవర్ కమిటీని నియమించింది. హైపవర్ కమిటీ నివేదిక ఇచ్చిన తర్వాత 2020 జనవరి 3న రాష్ట్ర సమగ్ర సమతుల అభివృద్ధికి సంబంధించి వికేంద్రీకరణ ఏకైక మార్గమని నివేదిక ఇచ్చింది. వీటన్నింటి నేపథ్యంలో 2020 జనవరి 22న పరిపాలన వికేంద్రీకరణ బిల్లుకు కేబినెట్ ఆమోదం తెలిపింది. ఆ తర్వాత అసెంబ్లీలో కూడా బిల్లును ప్రవేశ పెట్టారు. విశాఖను పరిపాలన రాజధానిగా, కర్నూలును న్యాయస్థాన రాజధానిగా, అమరావతిని శాసనసభ రాజధానిగా పేర్కొన్నారు.