అమరావతి: రాష్ట్రంలోని విద్యార్థులు, వారి తల్లిదండ్రులకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ముఖ్యమైన ప్రకటన జారీ చేసింది. విద్యార్థుల ఆధార్ వివరాలను సులభంగా అప్‌డేట్ చేసుకునేందుకు వీలుగా పాఠశాలల ప్రాంగణాల్లోనే ప్రత్యేక క్యాంపులు నిర్వహించాలని నిర్ణయించింది. ఈ నెల 17వ తేదీ నుంచి 26వ తేదీ వరకు రాష్ట్రవ్యాప్తంగా అన్ని పాఠశాలల్లో ఈ ఆధార్ అప్‌డేట్ క్యాంపులను ఏర్పాటు చేయనున్నారు.
ఈ మేరకు గ్రామ, వార్డు సచివాలయాల శాఖ డైరెక్టర్ శివప్రసాద్ అన్ని జిల్లాల కలెక్టర్లకు అధికారికంగా లేఖ రాశారు. ఈ ప్రత్యేక డ్రైవ్‌లో భాగంగా విద్యార్థుల బయోమెట్రిక్ వివరాలను (వేలిముద్రలు, కంటిపాప) అప్‌డేట్ చేయడంతో పాటు, పేరు, చిరునామా వంటి ఇతర వివరాలలో తప్పులుంటే సరిచేసుకునే అవకాశం కల్పించనున్నారు. విద్యార్థులు ఎలాంటి ఇబ్బందులు పడకుండా, వారు చదువుకునే చోటే ఈ సేవలు పొందేలా ప్రభుత్వం చర్యలు చేపట్టింది.
తల్లిదండ్రులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని, తమ పిల్లల ఆధార్ వివరాలను తప్పనిసరిగా అప్‌డేట్ చేయించాలని అధికారులు సూచిస్తున్నారు. ఆధార్ వివరాలు సరిగ్గా లేకపోతే భవిష్యత్తులో ప్రభుత్వ సంక్షేమ పథకాల ప్రయోజనాలు పొందడంలో సమస్యలు ఎదురయ్యే ప్రమాదం ఉందని ప్రభుత్వం హెచ్చరించింది.