పెట్రోల్, డీజిల్ ధరలపై సరైన సమయంలో నిర్ణయం తీసుకుంటామన్నారు ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి ధర్మాన కృష్ణదాస్. ప్రజలకు మేలు కలిగేలా మంచి నిర్ణయమే తీసుకుంటామని ధర్మాన తెలిపారు. కేంద్ర ప్రభుత్వం పెట్రోల్, డీజిల్‌పై ఎక్సైజ్ డ్యూటీని తగ్గిస్తూ ఇటీవల తీసుకున్న నిర్ణయాన్ని ధర్మాన కృష్ణదాస్ స్వాగతిస్తున్నామని చెప్పారు. రాష్ట్రంలో ఇంధన ధరలను తగ్గించాలంటూ ప్రభుత్వం ప్రతిపక్షాలు తీవ్ర స్థాయిలో ఒత్తిడి చేస్తున్నాయి. ఇప్పటికే బీజేపీ ప్రభుత్వం ఉన్న రాష్ట్రాల్లో వ్యాట్‌ను తగ్గించారు. అయితే తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వాలు మాత్రం ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు.
తాజాగా ధర్మాన కృష్ణదాస్ చేసిన వ్యాఖ్యలతో.. ఆంధ్రప్రదేశ్‌్ ప్రభుత్వం ఇంధన ధరలను ఎంతకు తగ్గిస్తుందన్న దానిపై సామాన్య ప్రజలు, వాహనదారుల్లో ఉత్కంఠ నెలకొంది. ఇప్పటికే దక్షిణ భారతదేశంలో ఆంధ్రప్రదేశ్‌లో పెట్రోల్, డీజిల్ ధరలు అధికంగా ఉన్నాయి. రాష్ట్రంలో ఇంధన ధరలు మండిపోతున్నాయి. విజయవాడలో లీటర్ పెట్రోల్ ధర రూ.110.35, లీటర్ డీజిల్ ధర రూ.96.44గా ఉంది. ఇక తెలంగాణ రాష్ట్రంలోని హైదరాబాద్‌లో లీటర్ పెట్రోల్ ధర రూ.108.20, డీజిల్ ధర రూ.94.62 గా ఉంది.