ఇంటిపేరును 'సారా'గా మార్చుకుంటే బాగుంటుంది : సీఎం జగన్ విమర్శనాస్త్రాలు
All cheap liquor brands were introduced by Chandrababu. తెలుగుదేశం పార్టీ తన పాలనలోని అన్ని చర్యలను ప్రస్తుత వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంపై రుద్దేందుకు
By Medi Samrat Published on 23 March 2022 9:00 PM ISTతెలుగుదేశం పార్టీ తన పాలనలోని అన్ని చర్యలను ప్రస్తుత వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంపై రుద్దేందుకు ప్రయత్నిస్తోందని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆరోపించారు. బుధవారం నాడు అసెంబ్లీలో జరిగిన చర్చలో పాల్గొన్న ఆయన.. రాష్ట్రంలో చీప్ లిక్కర్ బ్రాండ్‌లపై టీడీపీ నేతలు తీవ్ర విమర్శలు గుప్పిస్తున్నారని.. రాష్ట్రంలోని 20 డిస్టిలరీలలో 14 డిస్టిలరీలకు అనుమతులు ఇచ్చింది చంద్రబాబు నాయుడు ప్రభుత్వమేనని అన్నారు. 2019 నుండి ఒక్క డిస్టిలరీకి లేదా బ్రూవరీకి కూడా వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం అనుమతి ఇవ్వలేదని గుర్తు చేశారు.
"చంద్రబాబు ఇంటిపేరును నారా అని కాకుండా సారాగా మార్చుకుంటే బాగుంటుంది. మా బ్రాండ్లు నవరత్నాలు, అమ్మ ఒడి మొదలైనవి కాగా, ప్రెసిడెంట్ మెడల్, గవర్నర్ ఛాయిస్, బూమ్ బూమ్ బీర్, పవర్ స్టార్ 999, 999 లెజెండ్..ఇవన్నీ చంద్రన్న కానుక బ్రాండ్లే. ప్రెసిడెంట్ మెడల్ బ్రాండ్ అంటే చంద్రబాబు మెడల్ బ్రాండ్. గవర్నర్ ఛాయిస్ 2018కి చంద్రబాబు నవంబర్ 5, 2018న అనుమతి ఇచ్చారు. ఆయన పదవీవిరమణ చేసే ముందు చివరి నిమిషం వరకు మద్యం బ్రాండ్‌లకు నాన్‌స్టాప్‌గా అనుమతులు మంజూరు చేశారు. ఆయన హయాంలో దాదాపు 254 బ్రాండ్‌లను ప్రవేశపెట్టారు..అన్నీ ఆయన ట్రేడ్‌మార్క్ బ్రాండ్‌లు'' అని వైఎస్ జగన్ విమర్శించారు. ఏపీలో చీప్ లిక్కరే లేదని... తక్కువ ధరకు దొరుకుతున్న మద్యం మాత్రమే ఉందని అన్నారు.
స్పెషల్ స్టేటస్, త్రీ క్యాపిటల్స్ వంటి బ్రాండ్లు ఉన్నట్టు సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం చేస్తున్నారని సీఎం విమర్శించారు. వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత 16 కొత్త జిల్లాలు, మెడికల్ కాలేజీలకు అనుమతులు ఇచ్చామని, చంద్రబాబు మాత్రం 14 డిస్టిలరీలకు అనుమతి ఇచ్చారని అన్నారు. తెలుగుదేశం పార్టీ నేతలవి క్రిమినల్ బ్రెయిన్స్ అని జగన్ అన్నారు. జంగారెడ్డిగూడెం మరణాలపై టీడీపీ నేతలు చెప్పేవన్నీ అబద్ధాలేనని విమర్శించారు. పార్టీ పరంగా టీడీపీ, మీడియా పరంగా ఎల్లో మీడియా చీప్ బ్రాండ్స్ అని అన్నారు. వీరంతా మహిళా వ్యతిరేకులని చెప్పారు.