ఎన్నికలకు సమయం దగ్గర పడుతున్న వేళ ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు రోజరోజుకు మరింత ఆసక్తిగా మారుతున్నాయి. పాలకపక్షం, ప్రతిపక్షాల నేతల విమర్శలు, ప్రతివిమర్శలు చర్చనీయాంశమవుతున్నాయి. టీడీపీ, జనసేన నేతలు అధికార పార్టీ నేతలపై స్వరం పెంచగా.. వైసీపీ నేతలు కూడా వీలు దొరికినప్పుడల్లా ప్రతిపక్ష పార్టీ నేతలపై తమదైన శైలిలో స్పందిస్తూ వస్తున్నారు. ఇదిలావుండగా.. జనసేన అధినేత పవన్ కళ్యాణ్, వైసీపీ నేత, నటుడు అలీ స్నేహం గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. రాజకీయాల కారణంగానో, మరే ఇతర కారణమో ఇరువురు మధ్య బాగానే గ్యాప్ వచ్చింది. అప్పుడప్పుడు ఇరువురు కలుస్తారన్న వార్తలు వస్తున్నా.. అలాంటి సందర్భం ఏది కుదరలేదు.
ఇక ఇటీవల నటుడు అలీకి జగన్ ప్రభుత్వ ఎలక్ట్రానిక్ మీడియా సలహాదారు పదవిని అప్పజెప్పారు. ఈ నేపధ్యంలో ఆయన చాలా యాక్టివ్ అయ్యారు. అడపాదడపా కార్యక్రమాలలో పాల్గొంటూ తన స్వరం వినిపిస్తున్నారు. ఈ క్రమంలోనే తన మిత్రుడు పవన్‌పై పోటీకి సంసిద్ధతను వ్యక్తం చేశాడు అలీ. ఈ పరిణామం తీవ్ర చర్చనీయాంశమైంది ప్రస్తుతం. మీడియాతో అలీ మాట్లాడుతూ.. వైసీపీ అధిష్టానం ఆదేశిస్తే జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ పై పోటీకి సిద్ధమని ఆయన ప్రకటించారు. రాజకీయాల్లో విమర్శలకు ప్రతి విమర్శలు చేయడం సాధారణమన్నారు. రాజకీయాలు వేరు.. సినిమాలు వేరు అని తెలిపారు. పవన్ తనకు మంచి మిత్రుడేనని చెప్పారు. వచ్చే ఎన్నికల్లో 175 స్థానాల్లో వైసిపి గెలుపు ఖాయమని అలీ ధీమా వ్యక్తం చేశారు.