వైసీపీకి మద్దతుగా ఎన్నికల ముందు తీవ్రస్థాయిలో అప్పటి ప్రతిపక్షాలపై విరుచుకుపడిన టాలీవుడ్ నటుడు, రచయిత పోసాని కృష్ణమురళి సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఇక నుంచి నేను రాజకీయాలు మాట్లాడను అని.. ఇక నుంచి ఏ రాజకీయ పార్టీతో నాకు సంబంధం లేదని ప్రకటించారు. వైసీపీనే కాదు ఇప్పటి వరకు ఏ పార్టీలో నాకు సభ్యత్వం లేదన్నారు. ఏ పార్టీని పొగడను.. మాట్లాడను.. విమర్శించనని స్పష్టం చేశారు. నన్ను ఎవరూ ఏమనలేదు.. ఎవరి గురించి ఇక మాట్లాడను అని పేర్కొన్నారు. ఓటర్ లాగే ప్రశ్నించా.. మంచి చేస్తే వాళ్లకి సపోర్ట్ చేశానన్నారు. నా కుటుంబం, పిల్లల కోసం రాజకీయాలు వదిలేస్తున్నానని పోసాని కృష్ణమురళి ప్రకటించారు.
ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిని తాను చాలా సార్లు పొగిడానని వెల్లడించారు. తాను రాజకీయ నాయకులు, పార్టీల తీరు, విధానాల గురించి విమర్శలు చేస్తుంటాను తప్ప.. మంచి నాయకులను ఎప్పుడూ తిట్టలేదని తెలిపారు.
ఇదిలావుంటే.. చంద్రబాబు, పవన్ కళ్యాణ్, నారా లోకేష్‌లను వైసీపీ నేత పోసాని కృష్ణ మురళి.. అసభ్యకరంగా దూషించారన్న అభియోగాలపై ఇప్పటికే ఏపీ సీఐడీ అధికారులు కేసు నమోదు చేశారు. ఇదే కాకుండా ఆంధ్రప్రదేశ్‌లోని పలు పోలీస్ స్టేషన్లలోనూ పోసానిపై అనేక కేసులు నమోదయ్యాయి. బాపట్ల, అనంతపురం, పల్నాడు జిల్లా నరసరావుపేట, చిత్తూరు జిల్లా యాదమరి, తిరుపతి జిల్లా పుత్తూరులో పోసానిపై పోలీసులకు ఫిర్యాదులు చేశారు. ఈ క్రమంలో తాజాగా ఆయన మీడియా సమావేశం ఏర్పాటు చేసి రాజకీయాల నుంచి తప్పుకుంటున్నట్లు చెప్పడం గమనార్హం.