రాష్ట్రంలో ముఖ్యమంత్రి జగన్ రెడ్డి, వైసీపీ నేతలు, కార్యకర్తల తీరు యధా రాజా తధా ప్రజా అన్నట్టుగా తయారైందని టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు అన్నారు. పొద్దున్న లేస్తే ఎవరి ఆస్తులు విధ్వంసం చేద్దాం, ఎవరిపై అక్రమ కేసులు పెడదామా.. అని ఓ వైపు ముఖ్యమంత్రి ఆలోచిస్తుంటే.. మరో వైపు వైసీపీ కార్యకర్తలు మాత్రం ఎవరిపై దాడి చేద్దాం, ఎవరి ప్రాణాలు తీద్దాం, ఎవరి ఆస్తులు లాక్కుందామా అని ఆలోచిస్తున్నారు తప్ప.. ప్రజలకేం చేద్దామన్న ద్యాస ఏమాత్రం లేదని మండిపడ్డారు. రాష్ట్రంలో వైసీపీ గూండాల అరాచకాలకు, ఆగడాలకు అద్దు అదుపు లేకుండా పోతోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. పల్నాడు జిల్లా దాచేపల్లిలో టీడీపీ కార్యకర్త కానిశెట్టి నాగులు ఇంటిపై వైసీపీ గూండాల దాడిని ఖండించారు. నాగులు కుటుంబ సభ్యులపైనే కాక ఇంటి ఆవరణలో ఉన్న పశువులపై కూడా దాడి చేశారంటే వైసీపీ గూండాలు పశువుల కన్నా హీనంగా తయారయ్యారని స్పష్టం అవుతోందని ఆగ్రహం వ్యక్తం చేశారు.
నోరు లేని మూగజీవాలపై సైతం దాడికి పాల్పడటం హేయమైన చర్యగా అభివర్ణించారు. దాచేపల్లి మున్సిపల్ ఛైర్మన్ మునగ రామాదేవి భర్త, కుమారులు, బంధువులే నాగులు ఇంటిపై దాడికి పాల్పడ్డారని అన్నారు. ప్రశాంతంగా ఉన్న పల్నాడులో వైసీపీ రౌడీ మూకలు అల్లర్లు, అరాచకాలకు తెగబడుతూ ప్రజలను భయబ్రాంతులకు గురి చేస్తున్నారన్నారు. నాగులు ఇంటిపై దాడికి పాల్పడిన వారిని వెంటనే అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. టీడీపీ కార్యకర్తల జోలికొస్తే సహించేది లేదని హెచ్చరించారు. 2024లో వచ్చేది టీడీపీ ప్రభుత్వమే.. అధికార మదంతో అరాచకాలకు పాల్పడుతున్న వైసీపీ రౌడీ మూకలకు రిటర్న్ గిప్ట్ ఇస్తామని.. తీసుకునేందుకు వారు సిద్దంగా ఉండాలని అన్నారు.