రూ.30,000 లంచానికి ఆశపడి భారీ మూల్యం చెల్లించుకోనున్న వైద్యాధికారి
గతంలో కర్నూలు జిల్లా వైద్యారోగ్య అధికారి(డిఎంహెచ్ ఓ)గా పనిచేస్తూ రూ.30,000 లంచానికి ఆశపడిన ఒక డాక్టరుకు నేడు భారీ మూల్యం చెల్లించుకోవాల్సిన పరిస్థితి ఎదురైంది.
By Medi Samrat
గతంలో కర్నూలు జిల్లా వైద్యారోగ్య అధికారి(డిఎంహెచ్ ఓ)గా పనిచేస్తూ రూ.30,000 లంచానికి ఆశపడిన ఒక డాక్టరుకు నేడు భారీ మూల్యం చెల్లించుకోవాల్సిన పరిస్థితి ఎదురైంది. 2017లో ఆ అధికారి ఒక ప్రైవేట్ ఆసుపత్రి మరియు స్కానింగ్ సెంటర్ సేవల కొనసాగింపునకు( రెన్యువల్) లంచం అడిగినట్లు సమాచారం అందడంతో అవినీతి నిరోధక శాఖ(ఎసిబి) అధికారులు వలపన్ని రెడ్‌హ్యాండెడ్ గా పట్టుకున్నారు.
ఈ విషయంలో ఎసిబి 2019లో నమోదు చేసిన కేసుపై విచారణ చేపట్టిన కర్నూలు ఎసిబి ప్రత్యేక న్యాయస్థానం గత నెల ఇచ్చిన తీర్పులో సదరు వైద్యాధికారి లంచం తీసుకున్నట్లు నిర్ధారించింది. ఈ నేపథ్యంలో 2020లో పదవీ విరమణ చేసిన సదరు అధికారికి నియమాల ప్రకారం.. పింఛను, గ్రాట్యుటీ చెల్లింపులను తక్షణమే నిలిపివేయాలని వైద్యారోగ్య శాఖా మంత్రి సత్యకుమార్ యాదవ్ సోమవారంనాడు ఆదేశాలిచ్చారు.
ముడుపుల ఆరోపణలో న్యాయస్థానంలో విచారణ ఎదుర్కొంటున్న ఆ అధికారి 2020లో పదవీ విరమణ చేశారు. నియమాల ప్రకారం ఆ అధికారికి పింఛను మొత్తంలో 75 శాతాన్ని ప్రభుత్వం చెల్లిస్తోంది. వైద్యారోగ్య శాఖామంత్రి నేటి ఆదేశాలతో ఈ నెల నుంచి పెన్షన్ చెల్లింపును నిలిపివేస్తారు. ఆంధ్రప్రదేశ్ సవరించిన పెన్షన్ నిబంధనలు,1980 ప్రకారం ముడుపుల కేసుల్లో దోషులుగా నిర్ధారణ అయిన వారికి పింఛను, గ్రాట్యుటీ చెల్లింపులు చేయబడవు.
2020లో నమోదైన ఈ కేసులో సదరు కర్నూలు జిల్లా వైద్యారోగ్య అధికారిని గత నెలలో దోషిగా నిర్ధారించి ఒక ఏడాది పాటు కఠిన కారాగార శిక్షను, రూ.10,000 జరిమానాను కర్నూలు ఎసిబి ప్రత్యేక న్యాయస్థానం విధించింది. ప్రస్తుత నియమాల ప్రకారం 62 ఏళ్లకు పదవీ విరమణ చేసిన డిఎంహెచ్ఓలకు జీవితకాలం నెలకు సుమారు రూ.1,00,000కు పైగా పెన్షన్ పొందే అవకాశముంది. దీంతోపాటు సుమారు రూ.20 లక్షలు గ్రాట్యుటీ అందుతుంది. రూ.30,000 లంచానికి ఆశపడిన సదరు కర్నూలు జిల్లా వైద్యారోగ్య అధికారి ఈ మొత్తాన్ని కోల్పోయే పరిస్థితి ఎదురైంది.