నేను లోకల్.. ఏ ఒక్కరినీ వదిలిపెట్టను: ఏబీ వెంక‌టేశ్వ‌ర‌రావు

AB Venkateshwarrao Fire On AP govt Officers. ప్ర‌స్తుతం స‌స్పెన్ష‌న్‌లో ఉన్న ఏపీ కేడ‌ర్ సీనియ‌ర్ ఐపీఎస్ అధికారి ఏబీ వెంక‌టేశ్వ‌ర‌రావును

By Medi Samrat  Published on  22 April 2022 11:36 AM GMT
నేను లోకల్.. ఏ ఒక్కరినీ వదిలిపెట్టను: ఏబీ వెంక‌టేశ్వ‌ర‌రావు

ప్ర‌స్తుతం స‌స్పెన్ష‌న్‌లో ఉన్న ఏపీ కేడ‌ర్ సీనియ‌ర్ ఐపీఎస్ అధికారి ఏబీ వెంక‌టేశ్వ‌ర‌రావును త‌క్ష‌ణ‌మే విధుల్లోకి తీసుకోవాలంటూ స‌ర్వోన్న‌త న్యాయ‌స్థానం శుక్ర‌వారం నాడు ఏపీ ప్ర‌భుత్వానికి ఆదేశాలు జారీ చేసింది. ఆయనపై కొన‌సాగుతున్న స‌స్నెన్ష‌న్‌ను సుప్రీంకోర్టు ర‌ద్దు చేసింది. టీడీపీ హ‌యాంలో ఇంటెలిజెన్స్ డీజీగా ప‌నిచేసిన ఏబీ వెంక‌టేశ్వ‌ర‌రావు నిఘా ప‌రిక‌రాల కొనుగోలులో అక్ర‌మాల‌కు పాల్ప‌డ్డారంటూ వైసీపీ ప్ర‌భుత్వం ఆయ‌న‌పై స‌స్పెన్ష‌న్ విధించింది. అయితే త‌న‌పై స‌స్పెన్ష‌న్ విధించి రెండేళ్లు అవుతున్నా...ఇంకా ఎత్తివేయ‌లేద‌ని, త‌న‌ను స‌ర్వీసులోకి తీసుకునేలా ఆదేశాలు జారీ చేయాలంటూ ఆయన సుప్రీంకోర్టును ఆశ్ర‌యించారు. కేసు విచార‌ణ ద‌శ‌లో ఉండ‌గా ఏబీ వెంక‌టేశ్వ‌ర‌రావుపై విధించిన‌ స‌స్సెన్ష‌న్‌ను ఎత్తివేయ‌లేమ‌ని ఏపీ ప్ర‌భుత్వం స్సెష‌ల్ లీవ్ పిటిష‌న్ దాఖ‌లు చేసింది. ఈ వ్య‌వ‌హారంపై ఇంతకుముందే విచార‌ణ‌ను పూర్తి చేసిన సుప్రీంకోర్టు తీర్పును వాయిదా వేసింది. తాజాగా శుక్ర‌వారం తీర్పు వెలువ‌రించిన సుప్రీంకోర్టు ఐపీఎస్ అధికారుల‌పై రెండేళ్ల‌కు మించి స‌స్పెన్ష‌న్ విధించ‌డానికి వీల్లేద‌ని పేర్కొంది. ఈ నేప‌థ్యంలోనే ఏబీపై స‌స్పెన్ష‌న్‌ను ర‌ద్దు చేస్తున్న‌ట్లు ప్ర‌క‌టించింది.

ఢిల్లీలో ఏబీ వెంకటేశ్వరావు మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్ర ఉన్నతాధికారులపై విమర్శలు గుప్పించారు. ఏ బావ కళ్లలో ఆనందం కోసం ఇదంతా చేశారని ప్రశ్నించారు. ఏ శాడిస్ట్ కోసం, ఏ సైకో కోసం ఇదంతా చేశారని విమర్శించారు. తనను, తన కుటుంబాన్ని క్షోభ పెట్టి సాధించిందేమిటని అడగారు. కొందరు అధికారులు తప్పుడు కేసులతో ప్రభుత్వానికి చెడ్డ పేరు వచ్చేలా చేశారని అన్నారు. ఏపీ ప్రభుత్వం సుప్రీంకోర్టులో కేసు ఓడిపోవడానికి ఎవరు బాధ్యత తీసుకుంటారని ప్రశ్నించారు. సస్పెన్షన్ ను ప్రశ్నించడమే తాను చేసిన తప్పా? అని ఏబీ వెంకటేశ్వరరావు ప్రశ్నించారు. కేసులకు సంబంధించి ఫీజును కూడా చెల్లించాలంటూ ప్రభుత్వానికి లేఖ రాస్తానని చెప్పారు. ప్రజల ధనాన్ని దుర్వినియోగం చేసిన అధికారుల నుంచి రెవెన్యూ రికవరీ చేయాలని అన్నారు. బాధ్యులపై చర్యలు తీసుకునేంత వరకు వదిలి పెట్టనని చెప్పారు. రెండేళ్లు ముగిసిన తర్వాత సస్పెన్షన్ చెల్లదని చీఫ్ సెక్రటరీకి లేఖ రాశానని అయినప్పటికీ ఆయన నుంచి ఎలాంటి ప్రతిస్పందన లేదని అన్నారు. తాను ఎప్పుడూ చట్టం ప్రకారమే ముందుకెళ్లానని చెప్పారు. తాను లోకల్ అని... ఏ ఒక్కరినీ వదిలి పెట్టనని హెచ్చరించారు.

Next Story