రాష్ట్ర రాజధాని అమరావతిపై.. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దృష్టి పెట్టింది. మార్చి 15వ తేదీ నుంచి అమరావతి నిర్మాణ పనులు ప్రారంభించాలని నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. దాదాపు రూ.40 వేల కోట్ల విలువైన 62 పనులకు ఒకేసారి శ్రీకారం చుట్టనుంది. ఈ పనుల ప్రారంభం కోసం ఇప్పటికే సీఆర్డీఏ, ఏడీసీ టెండర్లను పిలిచింది. మరో 11 పనులకు కూడా సీఆర్డీఏ అధికారులు త్వరలోనే టెండర్లను పిలవనున్నారు. అయితే ఈ ప్రక్రియ ఆలస్యం అయ్యే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది.
కృష్ణా-గుంటూరు జిల్లా పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రక్రియ కొనసాగుతోంది. దీంతో ఈ ప్రక్రియ ఎన్నికల అనంతరం కొనసాగించే అవకాశం ఉందని పలువురు అధికారులు అంటున్నారు. అయితే అమరావతిలో పనులకు అభ్యంతరం లేదని ఈసీ గతంలోనే పేర్కొంది. కానీ టెండర్లను మాత్రం ఎన్నికలయిన తర్వాత పూర్తి చేయాలని తెలిపింది. టెండర్లు పిలుచుకోవచ్చు కానీ.. ఖరారు చేయవద్దని ఈసీ ఆదేశాలు జారీ చేసింది. ఏప్రిల్ మొదటి వారం నుంచి అమరావతిలో 30 వేల మంది కార్మికులు పని చేస్తారని అంచనా.