దుప్పికొమ్ము ఆకారంలో రాయి.. వైజాగ్ లో అరుదైన శస్త్ర చికిత్స

కిడ్నీల‌లో రాళ్లు ఉంటే రోగులు పడే అవస్థలు అన్నీ ఇన్నీ కావు. అయితే దాదాపు కిడ్నీ సైజు ఓ రాయి ఉందంటే!! వామ్మో అని అనిపిస్తుంది

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  19 Sep 2024 3:11 PM GMT
దుప్పికొమ్ము ఆకారంలో రాయి.. వైజాగ్ లో అరుదైన శస్త్ర చికిత్స

కిడ్నీల‌లో రాళ్లు ఉంటే రోగులు పడే అవస్థలు అన్నీ ఇన్నీ కావు. అయితే దాదాపు కిడ్నీ సైజు ఓ రాయి ఉందంటే!! వామ్మో అని అనిపిస్తుంది. కిడ్నీ నుండి ఆ రాయి ఏకంగా బ‌య‌ట క‌టివ‌ల‌యంలోకి వచ్చింది. సాధారణ రాయి తరహాలో అది లేదు. దుప్పికొమ్ము ఆకారంలో ఆ రాయి ఉంది. 80 మి.మీ. కంటే పొడ‌వున్న ఈ రాయి కిడ్నీ ఆకారంలోనే పెర‌గ‌డంతో మూత్ర‌నాళానికి అడ్డుగా రాదు.. దాంతో నొప్పి తెలియ‌దు. వాపు కూడా పెద్దగా ఉండదట. అందువ‌ల్ల రోగుల‌కు ఇది ఉంద‌నే విష‌య‌మే తెలియ‌దు.

అయితే అత్యున్న‌త‌ సాంకేతిక నైపుణ్యంతో విశాఖ‌ప‌ట్నంలోని ఏషియ‌న్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ నెఫ్రాల‌జీ అండ్ యూరాల‌జీ (ఏఐఎన్‌యూ) వైద్యులు ఈ రాయిని తొలగించారు. 62 ఏళ్ల వ్య‌క్తి నొప్పితో బాధ‌ప‌డుతూ ఆసుపత్రికి రాగా, అతడికి స్కాన్ చేస్తే కిడ్నీలో స్టాగ్ హార్న్ స్టోన్ (దుప్పి కొమ్ము త‌ర‌హా రాయి) ఉన్న‌ట్లు తేలింది. దాని వ‌ల్ల ఆయ‌న కిడ్నీ ప‌నితీరు కేవ‌లం 18% మాత్ర‌మే ఉంది. ఆ వ్యక్తికి రాయి కిడ్నీని దాటి క‌టివ‌ల‌యంలోకి కూడా వ‌చ్చింది. మామూలు రాళ్ల‌యితే సంప్ర‌దాయ ప‌ద్ధ‌తుల్లో వాటిని లోప‌ల ప‌గ‌ల‌గొట్టి బ‌య‌ట‌కు తీస్తారు.ఇది పెద్ద‌ది కావ‌డంతో కిడ్నీ వైపు నుంచి కాకుండా ముందు పొట్ట వైపు నుంచి తీసేందుకు పైలోలిథోట‌మీ అనే ప‌ద్ధ‌తిని అవ‌లంబించారు వైద్యులు. లాప‌రోస్కొపిక్ ప‌ద్ధ‌తిలో పెద్ద కోత లేకుండా చికిత్స చేశారు వైద్యులు. ఇంత‌కుముందు ఇదే చికిత్స‌ను ఓపెన్ స‌ర్జ‌రీ విధానంలో చేసేవారు.. కానీ ఇప్పుడు సాంకేతిక నైపుణ్యాలు పెర‌గ‌డంతో దీన్ని లాప‌రోస్కొపిక్ ప‌ద్ధ‌తిలో చేయ‌గ‌లిగారు. రాయి మొత్తం బ‌య‌ట‌కు తీసేశారు. ప్రస్తుతానికి రోగికి ఒక స్టెంట్ వేసి, శ‌స్త్రచికిత్స ముగించగా, నెల రోజుల త‌ర్వాత ఆ స్టెంట్ తీసేస్తామని వైద్యులు తెలిపారు. శ‌స్త్రచికిత్స అనంత‌రం ఎలాంటి ఇబ్బందులు లేక‌పోవ‌డంతో పేషెంటును రెండోరోజే డిశ్చార్జి చేసినట్లు డాక్ట‌ర్ అమిత్ సాప్లే తెలిపారు. ఈ శ‌స్త్రచికిత్స‌లో విశాఖ ఏఐఎన్‌యూ ఆస్ప‌త్రికి చెందిన యూరాల‌జిస్టులు డాక్ట‌ర్ ర‌వీంద్ర వ‌ర్మ‌, డాక్ట‌ర్ శ్రీ‌ధ‌ర్‌, ఎనెస్థ‌టిస్టు డాక్ట‌ర్ శ్యాం కీల‌క‌పాత్ర పోషించారు.

Next Story