ఏపీలోని కర్నూలు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. అదుపు తప్పిన ఓ కారు బావిలో పడిపోయింది. ముందు వెళ్తున్న వాహనాన్ని ఓవర్‌టేక్ చేయబోతుండగా ఈ ప్రమాదం జరిగింది. ఈ ఘటన ఎమ్మిగనూరు మండలం ఎర్రకోట గ్రామం దగ్గర జరిగింది. కర్నూలు నుండి ఎమ్మిగనూరు వెళ్తుండగా.. ఎర్రకోట గ్రామ సమీపంలో ముందును వాహనాన్ని కారు డ్రైవర్ ఓవర్ టేక్ చేసే ప్రయత్నం చేశాడు. ఈ క్రమంలోనే కారు అదపు తప్పి పొలాల్లో ఉన్న బావిలో పడిపోయింది. బావిలో పడిన హ్యూందాయ్ క్రెటా కారును చూసిన స్థానికులు.. వెంటనే పోలీసులకు సమాచారం చెరవేశారు.
విషయం తెలుసుకున్న పోలీసులు.. హుటాహూటిన సంఘటనా స్థలానికి చేరుకున్నారు. అనంతరం బావిలో పడిపోయిన కారును బయటకు తీశారు. ఈ విషాద ఘటనపై పోలీసులు చెప్పిన వివరాల ప్రకారం.. కారు కోడుమూరుకు చెందిన దశరథరామిరెడ్డి భార్య సుజాత రెడ్డి పేరు మీద ఉంది. ఎమ్మిగనూరులో ఉన్న రోగిని తీసుకువచ్చేందుకు కారులో డ్రైవర్ రామాంజి వెళ్లాడు. ఈ క్రమంలోనే కారును ఓవర్‌టేక్ చేయబోగా అదుపు తప్పింది. అదే సమయంలో బ్రేక్ ఫెయిల్ కావడంతో.. కారు పక్కనే ఉన్న బావిలోకి దూసుకెళ్లింది. బావిలోకి దూసుకెళ్లిన కారు 15 మీటర్ల లోతులో మట్టిలో ఇరుక్కుపోయింది. గజ ఈతగాళ్లతో కారుకు తాడును కట్టించి.. జేసేబీ సాయంతో బయటకు తీశారు. కారు డ్రైవర్ రామాంజి మృతి చెందాడు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.