Srikakulam: కాశీబుగ్గ శ్రీవారి ఆలయంలో తొక్కిసలాట.. ఏడుగురు మృతి.. సీఎం చంద్రబాబు విచారం

రాష్ట్రంలో ఘోర విషాదం చోటు చేసుకుంది. శ్రీకాకుళం జిల్లా కాశీబుగ్గ వేంకటేశ్వర ఆలయంలో తొక్కిసలాటలో 7 మంది మరణించారు.

By -  అంజి
Published on : 1 Nov 2025 12:50 PM IST

7 Killed , Stampede, Srikakulam ,Temple, Chandrababu, APnews

Srikakulam: కాశీబుగ్గ శ్రీవారి ఆలయంలో తొక్కిసలాట.. ఏడుగురు మృతి.. సీఎం చంద్రబాబు విచారం

అమరావతి: రాష్ట్రంలో ఘోర విషాదం చోటు చేసుకుంది. శ్రీకాకుళం జిల్లా కాశీబుగ్గ వేంకటేశ్వర ఆలయంలో తొక్కిసలాటలో 7 మంది మరణించారు. మృతుల్లో మహిళలు, పిల్లలే అధికంగా ఉన్నారు. కార్తీక మాసం ఏకాదశి కావడంతో వైష్ణవ ఆరాధన కోసం భక్తులకు అంచనాలకు మించి తరలి రావడంతో ఈ దుర్ఘటన సంభవించిందని స్థానికులు తెలిపారు. ఈ విషాదంలో పలువురు గాయపడగా.. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది. 7 మంది మరణానికి భారీగా భక్తులు రాక ప్రధాన కారణంగా తెలుస్తోంది.

దేవాలయ సామర్థ్యం 2 నుంచి 3 వేలు కాగా.. ఇవాళ ఏకంగా 25 వేల మందిపైగా తరలివచ్చారు. కార్తీక ఏకాదశి, శనివారం కావడంతో వెంకన్న స్వామి దర్శనం కోసం భారీగా భక్తజనం వచ్చారు. దీంతో సాధారణ స్థాయిలో రెయిలింగ్‌ విరగడంతో భక్తులు పడిపోయారు. ఒక్కసారిగా గందరగోళ పరిస్థతి తొక్కిసలాటకు దారి తీసింది. భక్తులు పెద్ద సంఖ్యలో రావడంతో అధికారులు నియంత్రించలేకపోయారు, ఫలితంగా తొక్కిసలాట జరిగింది. ముఖ్యమంత్రి ఎన్. చంద్రబాబు నాయుడు తొక్కిసలాటపై విచారం వ్యక్తం చేశారు. సహాయక చర్యలను ముమ్మరం చేయాలని అధికారులను ఆదేశించారు.

''శ్రీకాకుళం జిల్లాలోని కాశీబుగ్గ వెంకటేశ్వర ఆలయంలో తొక్కిసలాట ఘటన కలచివేసింది. ఈ దురదృష్టకర ఘటనలో భక్తులు మరణించడం అత్యంత విషాదకరం. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను. గాయాల పాలైన వారికి మేలైన సత్వర చికిత్స అందించాలని అధికారులను ఆదేశించాను. ఘటనా స్థలానికి వెళ్లి సహాయక చర్యలను పర్యవేక్షించాల్సిందిగా స్థానిక అధికారులను, ప్రజాప్రతినిధులను కోరాను'' అని తెలిపారు.

Next Story