వైసీపీ నేత హత్య కేసులో 11 మంది అరెస్ట్

నంద్యాల, బండి ఆత్మకూరు, గోస్పాడు పోలీసులు.. నంద్యాల-చాపిరేవుల రహదారి సమీపంలో బుడ్డారెడ్డి శ్రీనివాసరెడ్డి వర్గానికి చెందిన 11 మందిని అరెస్టు చేశారు

By Medi Samrat  Published on  7 Aug 2024 9:15 PM IST
వైసీపీ నేత హత్య కేసులో 11 మంది అరెస్ట్

నంద్యాల, బండి ఆత్మకూరు, గోస్పాడు పోలీసులు.. నంద్యాల-చాపిరేవుల రహదారి సమీపంలో బుడ్డారెడ్డి శ్రీనివాసరెడ్డి వర్గానికి చెందిన 11 మందిని అరెస్టు చేశారు. ఆగస్టు 3న మహానంది మండలం సీతారామపురం గ్రామానికి చెందిన వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ మద్దతుదారు పసుపులేటి సుబ్బరాయుడు (68) హత్యకేసులో వీరిని అరెస్టు చేశారు. హత్యకు ఉపయోగించిన మూడు కత్తులు, మూడు కర్రలు, రెండు సెల్‌ఫోన్లు, స్కోడా కారు, ఫార్చూనర్ కారును పోలీసులు స్వాధీనం చేసుకున్నట్లు జిల్లా ఎస్పీ అధిరాజ్ సింగ్ రాణా తెలిపారు. అరెస్ట్ అయిన వారిలో బుడ్డ ప్రభాకర్ రెడ్డి, వంగల లక్ష్మి రెడ్డి, వంగల పుల్లారెడ్డి, బి. నాగశేఖర్ రెడ్డి, తాలూరి శ్రీనివాసులు, పెరుమాళ్ల వెంకట రమణ, ఎం. రామచంద్రారెడ్డి, దూదేకుల బాల హుస్సేని, జిల్లెళ్ల భాస్కర్, గని రంగస్వామి, వంగాల ఈశ్వర్ రెడ్డి ఉన్నారు. మిగిలిన నిందితులను పట్టుకునేందుకు ప్రత్యేక బృందాలు ముమ్మరంగా గాలిస్తున్నాయి.

సీతారామాపురం గ్రామంలో ఆదివారం తెల్లవారుజామున సుబ్బరాయుడు దారుణ హత్యకు గురయ్యారు. టీడీపీ నాయకులు శ్రీనివాస్‌రెడ్డి అనుచరులు 30 మంది శనివారం అర్ధరాత్రి సుబ్బరాయుడు ఇంటి వద్దకు వచ్చారని.. సుబ్బారాయుడు ఎక్కడున్నాయని ఆయన భార్యను అడగ్గా.. తన భర్త ఇంట్లో లేరని ఆమె చెప్పారు. టీడీపీ నాయకులు ఆమెపై దాడి చేసి ఇంట్లోకి ప్రవేశించారు. ఇంట్లో నిద్రిస్తున్న సుబ్బరాయుడుని బయటకు ఈడ్చుకొచ్చి గొడ్డలి, కత్తులతో దాడి చేసి హత్య చేశారు. గత ఎన్నికల్లో వైసీపీ ఎమ్మెల్యే శిల్పా చక్రపాణిరెడ్డి తరఫున సీతారామాపురం గ్రామంలో సుబ్బరాయుడు ప్రచారం చేశారు. ఎన్నికల ముందు టీడీపీలోకి వెళ్లిన బుడ్డా శ్రీనివాస్‌రెడ్డి వీరిపై కక్ష పెంచుకున్నారు. ఊరి విడిచి వెళ్లిపోవాలని వారిని పలుమార్లు హెచ్చరించారు.

శనివారం రాత్రి సీతారామాపురం గ్రామం నుండి మాజీ ఎమ్మెల్యే శిల్పా అనుచరులు తమకు బుడ్డా శ్రీనివాస్‌రెడ్డి నుండి ప్రాణహాని ఉందని ఎస్‌పికి ఫోన్‌ ద్వారా తెలిపారు. దీనిపై ఎస్‌పి స్పందించి, గ్రామానికి ఒక ఎస్‌ఐ, ఇద్దరు కానిస్టేబుళ్లను పంపారు. అయితే వీరు హత్యను అడ్డుకోలేకపోయారు. ఈ కేసులో రూరల్ ఎస్ఐ శివ కుమార్ రెడ్డి, మహానంది ఎస్ఐ నాగేంద్ర ప్రసాద్ లపై వేటు వేసింది ప్రభుత్వం. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేశారు డీఐజీ కోయ ప్రవీణ్. ఈ నెల 3 తేదీ అర్ధరాత్రి ఎస్ఐ నాగేంద్ర ప్రసాద్ సమక్షంలోనే సుబ్బరాయుడు దారుణ హత్య జరిగినట్లు పోలీసులు గుర్తించారు. దీంతో ఎస్సై, పోలీసులు నిర్లక్ష్యం గా వహించారని సస్పెండ్ చేశారు.

Next Story