ఆంధ్రప్రదేశ్‌ రాజధాని మార్పు ఎందుకు..?

By అంజి  Published on  18 Dec 2019 5:23 AM GMT
ఆంధ్రప్రదేశ్‌ రాజధాని మార్పు ఎందుకు..?

అమరావతి: రాజధాని తొలి దశ నిర్మాణానికి 1.09 లక్షల కోట్లు అవసరమని మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రభుత్వం లెక్కలు వేసిందని సీఎం వైఎస్‌ జగన్‌ శాసనసభలో పేర్కొన్నారు. అయితే, అయిదేళ్ల పరిపాలన కాలంలో ఆయన కేవలం రూ.5800 కోట్లు మాత్రమే ఖర్చు చేశారని తెలిపారు. అందులోనూ రూ.5800 కోట్లు 10.5 శాతం వడ్డీతో బాండ్లు.. అప్పుల ద్వారా తీసుకురాగా.. దీని కోసం ప్రతీ ఏటా రూ.700 కోట్లు వడ్డీ క్రింద కట్టాలన్నారు. చంద్రబాబు ప్రకారం 5 సంవత్సరాలకు రూ.5 వేల కోట్లు ఖర్చు పెట్టి లక్ష రూ.10 వేల కోట్లు అవసరమ్యే రాజధాని ఎప్పుడు కట్టాలి? ఇంకో వందేళ్లు పట్టదా?

అప్పుడు రాజధాని నిర్మాణ ఖర్చు పది లక్షల కోట్లకు పెరగదా? పోనీ కేంద్రం ఏమైనా పెద్ద ఎత్తున సహాయం చేస్తోందా? అంటే అది కూడా లేదని శాసనసభలో వివరించారు. చంద్రబాబు గత ఐదేళ్లలో చేసిన అప్పులు రూ.2 లక్షల కోట్లు వడ్డీ క్రింద ఏటా రూ.25 వేల కోట్లు కడుతున్నామని సీఎం జగన్‌ చెప్పుకొచ్చారు. ఎక్కడ నుంచి తేవాలి డబ్బు? స్వయంగా ఎన్నికల ఫలితాలు వచ్చిన రోజే టీడీపీ ఆర్ధిక మంత్రి అయ్యన పాత్రుడు మాట్లాడుతూ... తమ టీడీపీ ప్రభుత్వం ఎన్ని అప్పులు చేయాలో అన్నీ చేశాము. ఇక జగన్ ప్రభుత్వానికి ఎక్కడా అప్పు పుట్టదు అని చెప్పాడన్నారు.

ఎగ్జిక్యూటివ్‌ క్యాపిటల్‌గా విశాఖ..

అందుకే అన్ని వసతులు ఉన్న విశాఖలో ప్రభుత్వ భూమి ఉన్న చోట సచివాలయం పెడితే మహా అయితే ఒక వెయ్యి కోట్ల రూపాయలతో అన్ని వసతులు వస్తాయన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో హైదరాబాద్ తరువాత అతి పెద్ద సిటీ విశాఖ.

ఇక్కడ అన్ని కులాలవారు ప్రశాంతంగా బ్రతుకుతారు. ముఖ్యంగా కాపులు, బలహీన వర్గాలు ,బ్రాహ్మిన్స్ ఎక్కువ

(కమ్మలు రెడ్లు తక్కవ). విశాఖలో ఎయిర్ పోర్ట్, సీ పోర్ట్ కేంద్ర సంస్థలు అయిన స్టీల్ ప్లాంట్ జింక్ , నేవీ ఉన్నాయి. ఇతర రాష్ట్రాల ప్రజలు పక్కనే ఉన్న ఒడిశా, ఉత్తర భారతం నుంచి కూడా బాగానే ఉన్నారు. విశాఖలో ఎగ్జిక్యూటివ్‌ క్యాపిటల్‌ పెడితే పెద్దగా ఖర్చవదని సీఎం జగన్‌ వెల్లడించారు. ఉద్యోగులు పనిచేయడానికి కావాల్సిన సదుపాయాలన్నీ అక్కడ ఉన్నాయి. ఒక మెట్రోరైలు వేస్తే సరిపోతుంది.

రాజధాని ప్రకటనకు ముందు (2014 జూన్‌ 1 నుంచి డిసెంబరు వరకు) కేవలం ఆర్నెళ్ల వ్యవధిలో 4,070 ఎకరాలను చంద్రబాబు, ఆయన సన్నిహితులు ఎక్కడి నుంచో వచ్చి లింగాయపాలెం, ఉద్దండరాయపాలెం, తుళ్లూరు .. లాంటి మారుమూల పల్లెల్లో భూములు కొన్నారని సీఎం జగన్‌ వివరించారు. ఇలా కొన్న వారిలో 90 శాతం మంది చంద్రబాబు కులస్తులే అని అసెంబ్లీలో బుగ్గన చదివి వినిపించిన పేర్ల ద్వారా తెలుస్తోందన్నారు.

దక్షిణాఫ్రికా మోడల్‌లో విశ్వనగరం విశాఖలో పరిపాలనకు ఆయువు పట్టు అయిన సచివాలయం(ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్), అమరావతిలో అసెంబ్లీ (లెజిస్లేటివ్ క్యాపిటల్ ), కర్నూల్‌లో హైకోర్ట్(జ్యుడీషియల్ క్యాపిటల్) పెట్టబోతున్నట్లు సీఎం జగన్‌ ప్రకటించారు. దక్షిణాఫ్రికాకు మూడు రాజధానులున్నాయి. ప్రిటోరియా, కేప్‌టౌన్, బ్లోమ్‌ఫాంటేన్.. ఈ మూడు నగరాలు సౌతాఫ్రికా రాజధానులు. అడ్మినిస్ట్రేటివ్ క్యాపిటల్‌గా ఉన్న ప్రిటోరియాలో ప్రభుత్వ శాఖలు, ఉద్యోగుల కార్యాలయాలు ఉన్నాయి. లెజిస్లేటివ్ క్యాపిటల్‌గా ఉన్న కేప్‌టౌన్‌లో చట్టసభలు మాత్రమే ఉన్నాయి. ఇక జ్యుడిషియల్ క్యాపిటల్‌గా బ్లోమ్‌ఫాంటేన్‌లో ఆ దేశ సుప్రీంకోర్టు ఉంటుంది.

Next Story