ఏపీలో మూడు రాజధానులు..చంద్రబాబు మండిపాటు

By రాణి  Published on  17 Dec 2019 1:21 PM GMT
ఏపీలో మూడు రాజధానులు..చంద్రబాబు మండిపాటు

ముఖ్యాంశాలు

  • సీఎం ఎక్కడుంటాడు ?
  • జగన్ ది తుగ్లక్ పాలన..!
  • అంధకారంలోకి ఆంధ్రప్రదేశ్ ?

వెలగపూడి : ఆంధ్రప్రదేశ్ రాష్ర్టంలో మూడు రాజధానులు పెట్టాల్సిన అవసరం ఉందన్నారు రాష్ర్ట ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి. ఆఖరి రోజు అసెంబ్లీ సమావేశంలో రాజధానిపై జరిగిన చర్చలో జగన్ ఈ విషయాన్ని వెల్లడించారు. ఏపీ లెజిస్లేటివ్(చట్ట సభలు) క్యాపిటల్ గా అమరావతి, విశాఖలో ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్, కర్నూల్ లో జ్యుడిషియల్ (హైకోర్టు) క్యాపిటల్ ను ఏర్పాటు చేయచ్చన్నారు. ఈ మేరకు ఏర్పాటు చేసిన నిపుణుల కమిటీ వారంరోజుల్లో నివేదిక ఇస్తుందని, త్వరలోనే దీనిపై నిర్ణయం తీసుకుంటామన్నారు. గతంలో రాజధాని కోసం ఖర్చు పెడతామని చెప్పినదానికన్నా చంద్రబాబు తక్కువ ఖర్చు చేశారని జగన్ తెలిపారు. అలాగే పోలవరం నుంచి సీమకు నీళ్లు తీసుకెళ్లేలా కొత్తప్లాన్లను సిద్ధం చేస్తున్నామన్నారు. టిడిపి సభ్యుల రియల్ ఎస్టేట్ వ్యాపారం గురించి వైసీపీ నేతలు స్పష్టంగా వివరించారని, 4,070ఎకరాలను చంద్రబాబు బినామీలే కొన్నారని సీఎం ఆరోపించారు.

ఏపీ అసెంబ్లీ నిరవధిక వాయిదా అనంతరం టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు పార్టీ నేతలతో కలిసి ఉండవల్లిలో నిరసన తెలిపారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ జగన్ పై నిప్పులు చెరిగారు. రాజధానిపై స్పష్టత అడిగితే సస్పెండ్ చేస్తారా అంటూ బాబు మండిపడ్డారు. జగన్ కు మతి సరిగ్గా లేదని, జగన్ తుగ్లక్ పాలనతో రాష్ర్ట అభివృద్ధి అధోగతి పాలవుతుందని, పూర్తిగా నష్టపోతుందని ఆవేదన చెందారు. ఒక రాష్ర్టానికి 3 ప్రాంతాల్లో రాజధానులను ఎవరైనా ఏర్పాటు చేస్తారా ? అని ప్రశ్నించారు. 3 రాజధానులను పెడితే సీఎం ఎక్కడ ఉంటాడు ? విశాఖలోనా..అమరావతిలోనా? అని చంద్రబాబు ప్రశ్నల వర్షం కురిపించారు. ఇలాంటి సీఎం ఎక్కడా ఉండడని విమర్శించారు. వైజాగ్ లో జగన్ భూములు కొన్నారని, అందుకే పక్కా ప్లాన్ ప్రకారమే ఇదంతా చేస్తున్నారని వాపోయారు. మూడు రాజధానుల ఏర్పాటుతో రాష్ర్టాన్ని అంధకారంలోకి నెట్టివేస్తున్నారని ఆందోళన చెందారు. ఈ విషయాన్ని కేంద్రం దృష్టికి తీసుకెళ్తామన్నారు.

Next Story
Share it