నా నియోజకవర్గంలో అభివృద్ధి శూన్యం : ఆనం రామనారాయణ రెడ్డి
By తోట వంశీ కుమార్ Published on 4 Jun 2020 10:47 AM ISTగత ఏడాది ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో భారీ విజయం సాధించి అధికారంలోకి వచ్చిన వైఎస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వం.. ఇటీవలే వార్షికోత్సవం జరుపుకుంది. ఈ సందర్భంగా పెద్ద ఎత్తున సంబరాలు జరిగాయి. ఐతే ఇంతలోనే ఆ పార్టీలో నిరసన గళాలు వినిపిస్తుండటం.. ప్రభుత్వంపై సొంత పార్టీ నేతల నుంచే విమర్శలు వస్తుండటం గమనార్హం. తమ నియోజకవర్గాల్లో పనులు సరిగ్గా జరగకపోవడం, ఇసుక సమస్య తదితర ఇబ్బందులపై ఇప్పటికే కిలారి రోశయ్య, మహీధర్ రెడ్డి లాంటి ఎమ్మెల్యేలు ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వంపై విమర్శలు చేశారు. మరోవైపు ఎంపీ రఘురామకృష్ణం రాజు ముందు నుంచే ప్రభుత్వానికి వ్యతిరేకంగా గళం విప్పుతున్నారు. మాజీ మంత్రి, వెంకటగిరి ఎమ్మెల్యే ఆనం రామనారాయణ రెడ్డి ప్రభుత్వంపై విమర్శలకు దిగారు.
ఏడాది పాలనలో కేకు సంబరాలు తప్ప నా నియోజకవర్గంలో అభివృద్ధి శూన్యం. సీఎం లేఖకే దిక్కులేని పరిస్థితి. మంత్రులు అధికారులు సీఎం లేఖనే పట్టించుకోవడం లేదు. ఇంకో ఏడాది చూస్తా. పనులు జరగకపోతే ప్రభుత్వాన్ని నిలదీస్తా అని ఆనం వ్యాఖ్యానించారు. తన జిల్లాలో అధికారుల పనితీరు ఏమాత్రం బాగా లేదని.. విద్య, వైద్యం, సంక్షేమ పథకాలపై నివేదికలు తయారుచేయలేదని ఆయన విమర్శించారు. జలవనరుల శాఖలో అధికారులు నీళ్లు అమ్ముకుంటున్నారని, ఎస్‌ఎస్ కెనాల్‌ను పరిశీలించాలని సీఎం జగన్ చెప్పినా అధికారులు వినడం లేదని అన్నారు. 40 ఏళ్ల రాజకీయ జీవితంలో ప్రస్తుతం జరుగుతున్న తీరు ఎప్పుడూ చూడలేదన్న ఆనం.. 23 జిల్లాలున్న ఉమ్మడి రాష్ట్రానికి మంత్రిగా చేసిన తనకు ఎమ్మెల్యే పదవి అలంకారం కాదని అన్నారు. ప్రజల కోసం ప్రభుత్వాన్ని, అధికారులను నిలదీయడానికి సిద్ధమని ఆనం ప్రకటించారు. ఒకప్పుడు కాంగ్రెస్ పార్టీలో ఒక వెలుగు వెలిగిన ఆనం.. తర్వాత తెలుగుదేశం పార్టీలో ఉన్నారు. 2018లో వైకాపాలోకి వచ్చి ఆ పార్టీ నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు.