'మర్డర్' సినిమా విడుదలను ఆపాలంటూ అమృత పిటిషన్
By తోట వంశీ కుమార్ Published on 5 Aug 2020 11:36 AM ISTనిత్యం వివాదాలతో సావాసం చేసే దర్శకుడు రామ్‌గోపాల్ వర్మ. తాజాగా ఆయన తెరకెక్కిస్తున్న చిత్రం 'మర్డర్'. దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన ప్రణయ్ హత్యకేసు ఆధారంగా వర్మ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు. ఇప్పటికే ఈ చిత్ర ట్రైలర్‌ను, ఓ పాటను విడుదల చేశారు. వాస్తవ సంఘటనలకు దూరంగా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారని మృతుడు ప్రణయ్ భార్య అమృత ఆరోపించారు. ఈ సినిమా చిత్రీకరణను ఆపాలంటూ నల్లగొండ కోర్టులో జూలై 29న పిటిషన్ దాఖలు చేశారు.
హత్య కేసు విచారణలో ఉందని, కల్పిత కథతో ఉన్న సినిమా విడుదల అయితే.. సాక్షులపై వ్యతిరేక ప్రభావం పడే అవకాశం ఉందని, అందుకే సినిమాను విడుదలను ఆపేలా మధ్యంతర ఉత్తర్వులు జారీ చేయాలని ఆమె కోరారు. తమ అనుమతి లేకుండా పేర్లు, నిజ జీవితంలో జరిగిన సంఘటనల ఆధారంగా సినిమా తీసి తమ జీవితాలపై ప్రభావం చూపుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
అమృత పిటిషన్‌ను నల్లగొండ కోర్టు.. ఎస్సీ ఎస్టీ కోర్టుకు బదిలీ చేసింది. దీనిపై స్పందించిన కోర్టు ఈ నెల 6న ‘మర్డర్’ సినిమా దర్శక నిర్మాతలు కోర్టుకు హాజరు కావాల్సిందిగా నోటీసులు జారీ చేసింది. కోర్టు ఆదేశాల మేరకు ప్రతివాదులకు నోటీసులను ఈ మెయిల్, వాట్సాప్ ద్వారా నోటీసులు పంపారు.