టాలీవుడ్‌ కమెడియన్‌, వైసీపీ నేత పృధ్వీరాజ్ అనారోగ్యంతో బాధపడుతున్నారు. దీంతో ఆయన ఆస్పత్రిలో చేరారు. ఆస్పత్రి బెడ్‌ పై నుంచి ఆయన ఓ వీడియోని రిలీజ్‌ చేశారు. గత 10 రోజులుగా తీవ్రమైన జ్వరంతో బాధపడుతున్నానని, పలుమార్లు పరీక్షలు చేయించుకున్నా కరోనా నెగిటివ్‌ వచ్చిందన్నారు. అయితే.. జ్వరం మాత్రం తగ్గడం లేదన్నారు. కోవిడ్‌ నెగిటివ్‌ వచ్చినప్పటికి 15 రోజులు ఐసోలేషన్‌లో ఉండమని డాక్టర్‌లు సలహా ఇచ్చిన మేరకు సోమవారం అర్ధరాత్రి ఆసుపత్రిలో చేరానని తెలిపారు. అభిమానుల ఆశీర్వాదాలతో పాటు వెంకటేశ్వరస్వామి దీవెనలు తనకుండాలని కోరుకుంటున్నానని, త్వరలోనే ఆరోగ్యవంతుడ్ని కావాలని కోరుకుంటున్నానని పృథ్వీ ఆ వీడియోలో తెలిపారు.

గత ఎన్నికల్లో వైసీపీ తరుపున ప్రచారం చేశారు పృథ్వీ. ఆ పార్టీ అధికారం లోకి వచ్చాక అనూహ్యంగా ఎస్వీబీసీ చైర్మన్‌గా నియమితులయ్యారు. కొంతకాలం తర్వాత అక్కడ ఉద్యోగినితో పృథ్వీ రాసలీలలు సాగిస్తున్నారనే ఆరోపణలు రావడం, ఓ ఆడియో టేప్ బయటపడటంతో ఆ పదవికి రాజీనామా చేయాల్సి వచ్చింది. కాగా.. లాక్ డౌన్ వలన చాలా కాలం ఇంటికే పరిమితం అయిన ఆయన అనంతరం ఇచ్చిన సడలింపులతో బయటకు వచ్చారు. కొన్ని షూటింగ్స్ లో కూడా ఆయన పాల్గొన్నట్టు సినీ వర్గాల నుండి అందుతోన్న సమాచారం.

వంశికుమార్ తోట

నాపేరు వంశికుమార్. నేను న్యూస్ మీటర్ తెలుగులో జర్నలిస్ట్ గా పనిచేస్తున్నాను. గతంలో నేను ఆంధ్రప్రభ, ఆంధ్ర‌జ్యోతిలో పనిచేశాను. జర్నలిజం పట్ల నాకు ఉన్న ఇష్టం, ఆసక్తితో నేను ఈ వృత్తిని ఎంచుకున్నాను.