అత్యంత తీవ్ర తుఫానుగా మారిన 'అంఫన్'.. హెచ్చరికలు జారీ చేసిన అధికారులు
By సుభాష్ Published on 18 May 2020 4:12 PM ISTవాతావరణ అధికారులు ఊహించినట్లుగా అత్యంత తీవ్ర తుఫానుగా మారిన అంఫన్... పశ్చిమబెంగాల్, బంగ్లాదేశ్ తీరం వైపు పయనిస్తోంది. ఏపీలోని సముద్ర తీరం కల్లకలోలంగా మారే అవకాశం ఉంది. ఒడిశా మొదలు నుంచి బెంగాల్ సహా ఉత్తరాదిని అతలాకుతలం చేసేందుకు అంఫన్ తుఫాను బలమైన శక్తిగా మారనుందని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది. ఈ మేరకు పశ్చిమ బెంగాల్, ఒడిశా, యూపీ, బీహార్, ఛత్తీస్‌గఢ్, జార్ఖండ్ రాష్ట్రాలతో పాటు కొన్ని ఈశాన్యం రాష్ట్రాలను హెచ్చరించింది.
సోమవారం తెల్లవారుజాము వరకూ అతివేగంతో ఉత్తరదిశగా కదులుతున్న అంఫన్ తుఫాన్ బుధవారం మధ్యాహ్నం వరకూ బెంగాల్ రాష్ట్రంలో తీరం దాటే అవకాశం ఉందని వాతావరణశాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. ప్రస్తుతం ఒడిశాలోని పారాదీప్‌కు దక్షిణంగా 850 కిలోమీటర్ల దూరంలోనూ, బెంగాల్‌లోని దిఘాకు నైతిరు దిశలో 980 కిలోమీటర్ల దూరంలోనూ అంఫన్ తుఫాను కేంద్రీకృతమై తీవ్ర రూపం దాల్చే అవకాశం ఉందని అధికారులు హెచ్చరిస్తున్నారు. కాగా, సోమవారం రాత్రి వరకూ ఈ తుఫాను తీవ్రతరమవుతుందని హెచ్చరిస్తున్నారు.
కాగా, బుధవారం మధ్యాహ్నం వరకూ ఈ తుఫాను బెంగాల్, బంగ్లాదేశ్‌ల మధ్య తీరం దాటే అవకాశాలు కనిపిస్తున్నాయని అంచనా వేస్తున్నారు. అయితే తీరం దాటే సమయంలో ఒడిశా, బెంగాల్ తీరంలో 110-120 కిలోమీటర్ల వేగంతో పెనుగాలులు వీస్తాయని చెబుతున్నారు.
తుఫానుపై కేంద్ర హోంశాఖ దృష్టి
కాగా, ప్రస్తుతం ఈ తుఫాను తీవ్రతరం కానున్న నేపథ్యంలో కేంద్ర హోంశాఖ ఎప్పటికప్పుడు దృష్టి సారిస్తోంది. నిమిషం.. నిమిషం కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ఫోన్‌కు అప్‌డేట్ అలర్డ్ మెసేజ్ లు అధికారులు చేరవేరుస్తున్నారు. ఈ తుఫాను ఒడిశా తీరం పక్క నుంచి వెళ్తున్నందున బాలాసోర్, జైపూర్, భద్రక్, మయూర్‌భంజ్ జిల్లాలకు తీవ్రంగా నష్టం జరిగే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. ఈ తుఫాను వల్ల తీవ్ర నష్టం వాటిల్లే అవకాశాలున్నాయని అధికారుల హెచ్చరికల నేపథ్యంలో ప్రధాని నరేంద్రమోదీతో పాటు అమిత్‌షాలు ముందస్తుగా సమీక్ష నిర్వహించి జాగ్రత్తలు తీసుకుంటున్నారు.
ఇక తెలుగు రాష్ట్రాలతో పాటు ఒడిశా బెంగాల్‌లోని నాలుగు రోజుల పాటు వర్షాలు భారీగా ఉండే అవకాశం ఉందని, జాలర్లు సముద్రం వైపు ఎట్టి పరిస్థితుల్లో వెళ్ల కూడదని కేంద్ర వాతావరణ విభాగం (ఐఎండీ) సూచిస్తోంది. ఇప్పటికే ఒకటో నంబర్ ప్రమాద హెచ్చరికలు జారీ చేసింది.