చెన్నై లోని అమ్మోనియం నైట్రేట్ ను కొన్న హైదరాబాద్ వ్యాపారి
By న్యూస్‌మీటర్ తెలుగు Published on 10 Aug 2020 11:04 AM ISTచెన్నైలో నిల్వ ఉంచిన 740 టన్నుల అమ్మోనియం నైట్రేట్ ను హైదరాబాద్ కు చెందిన ఓ వ్యాపారి కొన్నట్లు అధికారులు తెలిపారు. 10 కంటైనర్లలో రోడ్డు మార్గం ద్వారా సదరు వ్యాపారికి చెందిన ప్రాంతానికి తరలిస్తూ ఉన్నారు. లెబనాన్ రాజధాని బీరూట్ లో భారీ పేలుడు కారణం అమ్మోనియం నైట్రేట్ అని తెలియగానే ఇతర దేశాలకు చెందిన అధికారులు కూడా అప్రమత్తమయ్యారు. భారతదేశంలో కూడా పలు రాష్ట్రాల్లో అమ్మోనియం నైట్రేట్ నిల్వలు ఉన్నట్లు గుర్తించారు.
చెన్నై లోని షిప్ యార్డ్ లో 740 టన్నుల అమ్మోనియం నైట్రేట్ ను గుర్తించిన అధికారులు వాటిని ఎక్కడికైనా తరలించాలి.. లేదా అమ్మేయాలని భావించారు. కస్టమ్స్ అధికారులు హైదరాబాద్ కు చెందిన వ్యాపారికి అమ్మినట్లు తెలుస్తోంది. హైవే ఆథారిటీస్, పొల్యూషన్ కంట్రోల్ బోర్డు సహకారంతో సదరు వ్యాపారి చెన్నై నుండి దాన్ని తరలించనున్నారు. కస్టమ్స్ డాక్యుమెంట్స్ ప్రకారం 697 టన్నుల అమ్మోనియం నైట్రేట్ ను మాత్రమే తరలిస్తున్నట్లు తెలుస్తోంది. 740 టన్నుల అమ్మోనియం నైట్రేట్ ఉండగా.. 697 టన్నులు మాత్రమే ఆ వ్యాపారికి అమ్మడంపై పలు ప్రశ్నలు ఉత్పన్నమవుతూ ఉన్నాయి.
ఉత్తర చెన్నైలోని అమ్మోనియం నైట్రేట్ నిల్వ ఉంచిన ప్రాంతాన్ని పెట్రోలియం, ఎక్స్ప్లోజివ్స్ సేఫ్టీ ఆర్గనైజేషన్(పిఈఎస్ఓ) అధికారులు పరిశీలిస్తున్నారు. అన్ని భద్రతాపరంగా ఎలాంటి చర్యలు చేపట్టారు.. తరలించే సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై కూడా అధికారులు సమీక్షించారు. 2015 నవంబర్ లో కరూర్ కు చెందిన అమ్మన్ కెమికల్స్ కు చెందిన అమ్మోనియం నైట్రేట్ ను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. తాను దిగుమతి చేసుకున్న రసాయనం వ్యవసాయ రంగంలో ఎరువుగా ఉపయోగించేదని యజమాని చెబుతున్నా అధికారుల తనిఖీల్లో అది పేలుడు పదార్థం స్థాయిలో ఉందని, వ్యవసాయిక ఎరువు కంటే దాని తీవ్రత అధికంగా ఉందని తేలింది. 1.80 కోట్ల విలువైన ఆ అమ్మోనియం నైట్రేట్ ను అధికారులు జప్తు చేశారు.
లెబనాన్ రాజధానిలో విధ్వంసానికి కారణం ఓ గోడౌన్ లో నిల్వ ఉంచిన 2,750 టన్నుల అమ్మోనియం నైట్రేట్ పేలడమే..! 2013 లో రష్యాకు చెందిన కార్గోలో ఈ అమ్మోనియం నైట్రేట్ బీరూట్ కు చేరింది. బీరూట్ లోని హ్యాంగర్ 12లో ఈ అమ్మోనియం నైట్రేట్ ను నిల్వ ఉంచారు. కస్టమ్స్ అధికారులు ఆ అమ్మోనియం నైట్రేట్ ను డిస్పోజ్ చేయడానికై మూడేళ్ళుగా అధికారులకు లెటర్లు రాసిన రిపోర్టులు వెలుగులోకి వచ్చాయి. వాళ్లు మూడు సలహాలు కూడా ఇచ్చినట్లు తెలుస్తోంది. అమ్మోనియం నైట్రేట్ ను ఇతర దేశాలకు ఎగుమతి చేయడం, లెబనీస్ ఆర్మీకి అందించడం, లెబనీస్ కు చెందిన ఎక్స్ ప్లోజివ్స్ కంపెనీలకు అమ్మేయాలని సలహాలు ఇచ్చారు. అయినా పట్టించుకోలేదు అధికారులు.