మాజీ ప్రియుడిపై కోర్టుకెళ్లిన అమలాపాల్
By న్యూస్‌మీటర్ తెలుగు Published on 4 Nov 2020 7:38 AM IST
డైరెక్టర్ ఎ.ఎల్.విజయ్ ను ప్రేమించి పెళ్లిచేసుకున్న అమలాపాల్ అతని నుండి విడిపోయిన విషయం తెలిసిందే. అనంతరం అమలాపాల్ ముంబైకి చెందిన సింగర్ భవిందర్ సింగ్‌తో ప్రేమలో పడింది. తర్వాత అతనితో కూడా విడిపోయింది. ఈలోపు కోవిడ్ మహమ్మారి రావడంతో అమలాపాల్ ఇంటికే పరిమితమైంది.
అయితే.. లాక్‌డౌన్‌కు ముందు భవిందర్ సింగ్, అమలాపాల్ పెళ్లి చేసుకున్నట్లు ఫొటోలు నెట్టింట హల్‌చల్ చేశాయి. తర్వాత అలాంటిదేమీ లేదని అమలాపాల్ వివరణ ఇచ్చుకుంది. అయితే.. ఓ ప్రకటన కోసం తీసుకున్న ఫొటోలను తన మాజీ ప్రియుడు భవిందర్ తన సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంపై అమలాపాల్ సీరియస్ అయ్యింది.
ఈ విషయమై తప్పుడు శీర్షికతో తన ఫొటోలను ప్రచురించిన భవిందర్‌పై పరువు నష్టం కేసు వేయడానికి అనుమతి ఇవ్వాలని అమలాపాల్ చెన్నై కోర్టును కోరింది. కేసు వివరాలు విన్న జడ్జి భవిందర్ సింగ్‌పై కేసు వేయడానికి అనుమతినిచ్చారు. దీంతో ఈ వ్యవహారం ముందుముందు ఎటువంటి మలుపులు తిరుగుతుందో వేచి చూడాలి మరి.