ప్ర‌పంచాన్ని వ‌ణికిస్తున్న క‌రోనాతో అంతా త‌ల‌లు ప‌ట్టుకుంటుంటే.. తొలి నుండి ఆ వైర‌స్‌ను క‌ట్ట‌డి చేసిన అసోం రాష్ట్రాన్ని ఇప్పుడు కొత్త స‌మ‌స్య వేధిస్తుంది. ఆ రాష్ట్రంలో ఆఫ్రికన్ స్వైన్ ఫ్లూ విజృంభిస్తోంది. ఇది అత్యంత ప్ర‌మాద‌క‌ర అంటువ్యాధి. వివ‌రాళ్లోకెళితే.. అసోం రాష్ట్రంలోని ఏడు జిల్లాల్లోని 306 గ్రామాల్లో 2,500కు పైగా పందులు ఈ ప్ర‌మాద‌ర‌క వైర‌స్ బారిన‌ప‌డి మృత్యువాత ప‌డ్డాయి.

దీంతో కేంద్రం అప్రమత్తమైంది. వ్యాధి వ్యాప్తిని అరికట్టేందుకు పందులను సామూహికంగా చంపేందుకు అనుమతించింది. అయితే.. అసోం ప్ర‌భుత్వ యంత్రాంగం మాత్రం.. తాము ఆ పని చేయబోమని, వ్యాధిని నియంత్రించేందుకు ఇత‌ర‌ మార్గాల‌కై ప్ర‌య‌త్నిస్తున్నామ‌ని తెలిపింది. వ్యాధి ప్ర‌భావం ఉన్న ప్రాంతాల్లో ఉన్న పందుల నుంచి న‌మూనాలు సేక‌రించి ప‌రీక్షించిన అనంత‌రం వాటిని చంపుతామ‌ని తెలిపింది.
ఇదిలావుంటే.. ఆఫ్రికన్ స్వైన్ ఫ్లూ వల్ల మనుషుల‌కు ఎలాంటి హాని జ‌ర‌గ‌ద‌ని ప్ర‌భుత్వం పేర్కొంది. వ్యాధి లేని ప్రాంతాల్లో ప్రజలు పంది మాంసాన్ని తినొచ్చని తెలిపింది. ఇక అసోంలో గడిచిన కొన్ని రోజులుగా ఒక్క కరోనా కేసు కూడా నమోదు కాలేదని ఆరోగ్యశాఖా మంత్రి హిమాంత బిస్వా శర్మ ప్రకటించారు. ఇక‌పోతే.. గడచిన 24 గంటల్లోనే దేశవ్యాప్తంగా దాదాపు 2,700మందికి కొత్తగా వైరస్ నిర్దారణ అయ్యింది. దీంతో మొత్తం కేసుల సంఖ్య 42,500వేలు దాటింది. ఆదివారం ఉదయం నుంచి సోమవారం ఉదయం వరకు 83 మంది మృతిచెందారు.

న్యూస్‌మీటర్ తెలుగు

విశ్వసనీయమైన డిజిటల్ మీడియా ప్లాట్‌ఫారమ్ మీకు విశ్వసనీయ వార్తా కథనాలను మరియు ప్రస్తుత వ్యవహారాల విశ్లేషణను తెస్తుంది.