ఆ పార్టీలో చేరి.. దేవుడు వైఎస్సార్ రుణం తీర్చకుంటా.. తెలంగాణ పోలీస్ అధికారి
By అంజి Published on 9 Feb 2020 4:06 PM ISTహైదరాబాద్: ఓ ఇంటర్వ్యూలో తెలంగాణ సీఐడీ అడిషనల్ ఎస్పీ హనుమంతరావు కీలక వ్యాఖ్యలు చేశారు. త్వరలోనే వైఎస్సార్‌కాంగ్రెస్ పార్టీలో చేరుతానన్నారు. ఉద్యోగానికి రాజీనామా చేసో లేదంటే రెండున్నరేళ్ల తర్వాతనైన వైసీపీలో చేరతానని ఆయన వ్యాఖ్యనించారు. వైఎస్సార్‌లో దేవుడిని చూశానని, ఆయన లేకపోతే తాను లేనని ఎస్పీ హనుమంతరావు అన్నారు. వైసీపీ చేరి ఆ దేవుడు వైఎస్సార్ రుణం తీర్చుకుంటానని ప్రముఖ యూట్యూబ్ ఐడ్రీమ్ న్యూస్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో హనుమంతరావు వ్యాఖ్యనించారు.
తన కుటుంబం ఇవాళ జీవించి ఉందంటే అది వైఎస్సార్ వల్లేనని.. తన కుటుంబం మొత్తం వైఎస్సార్‌కు రుణపడి ఉందని అన్నారు. కుటుంబ సభ్యులు వద్దని చెప్పినా వినకుండా పోలీస్ ఉద్యోగానికి రాజీనామా చేశానన్నారు. ప్రజారాజ్యం పార్టీలో చేరడానికి జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్ అప్పుడు కీలక పాత్ర పోషించారని.. ఇంటర్వ్యూలో ఎస్పీ హనుమంతరావు చెప్పుకొచ్చారు. అయితే 2009 ఎన్నికల్లో ప్రజారాజ్యం పార్టీ తరఫున పోటీ చేసి సర్వం కోల్పోయానన్నారు. అప్పుడే చనిపోదామని అనుకున్నానని అన్నారు.
విజయవాడ సెంట్రల్ ఎమ్మెల్యే మల్లాది విష్ణుకు తనకు ఓ కామన్ ఫ్రెండ్ ఉన్నాడని.. ఆయన ద్వారా వైఎస్ రాజశేఖర్‌రెడ్డి కలిసానని హనుమంతరావు చెప్పారు. తన ఆగమ్యగోచర పరిస్థితి చూసి చలించిపోయిన రాజశేఖర్ రెడ్డి.. తిరిగి తనను ఉద్యోగంలోకి తీసుకున్నారని, ఎక్కడ పోస్టింగ్ కావాలో కూడా కోరుకోమన్నారని హనుమంతరావు.. ఐడ్రీమ్ న్యూస్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో తెలిపారు. ఆయన ద్వారానే తిరిగి పోలీస్ డ్రెస్ ధరించానని..ఇప్పుడు ఈ స్థితిలో ఉన్నానని చెప్పారు.
వైఎస్సార్ మరణవార్త.. విన్న తర్వాత చాలా భావోద్వేగానికి లోనయ్యామని, తాను సాధారణంగా ఏడవనని.. కానీ వైఎస్సార్ ఇక లేడని తెలిసిన తర్వాత చాలా భయంకరంగా ఏడ్చానని ఎస్పీ హనుమంతరావు చెప్పారు. తనకు ఇద్దరు పిల్లలు ఉన్నారని.. ఒక కొడుకు సెటిల్ అయ్యాడని.. ఇంకో కొడుకు కూడా త్వరలో సెటిల్ అవుతాడని అన్నారు. వైసీపీలో చేరి సాధారణ కార్యకర్తలాగా పని చేస్తానన్నారు. ప్రకాశం జిల్లాకు చెందిన హనుమంతరావు 2009 ఉద్యోగానికి రాజీనామా చేశారు. ఆ తర్వాత సాలూరు నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిపోయారు. ఆ తర్వాతి తిరిగి పోలీస్ డిపార్ట్‌మెంట్‌లో జాయిన్ అయ్యారు. ప్రస్తుతం హనుమంతరావు.. తెలంగాణ సీఐడీ అడిషనల్ ఎస్పీగా కొనసాగుతున్నారు.