కాంగ్రెస్‌కు మరో ఎదురు దెబ్బ.. బీజేపీలోకి కుష్బూ..!

By సుభాష్  Published on  12 Oct 2020 3:36 AM GMT
కాంగ్రెస్‌కు మరో ఎదురు దెబ్బ.. బీజేపీలోకి కుష్బూ..!

కాంగ్రెస్‌కు మరో ఎదురుదెబ్బ తగలనుంది. తమిళనాకుడుకు చెందిన ప్రముఖ సినీనటి, కాంగ్రెస్‌ పార్టీ సీనియర్‌ నేత కుష్బూ ఆ పార్టీని వీడనున్నట్లు తెలుస్తోంది. కాంగ్రెస్‌ పార్టీకి గుడ్‌బై చెప్పి బీజేపీలో చేరబోతున్నట్లు ఢిల్లీ రాజకీయ వర్గాలు అంటున్నాయి. బీజేపీ జాతీయ అధ్యక్షుడు నడ్డా సమక్షంలో సోమవారం కమలం గూటికి చేరనున్నట్లు సమాచారం. దీని కోసం ఇప్పటికే హస్తినకు చేరుకున్న కుష్బూ.. బీజేపీ పెద్దలను కలిశారని, వారు కూడా స్వాగతం పలికారని తెలుస్తోంది. మరో వైపు సీనియర్‌ నేతను బుజ్జగించేందుకు కాంగ్రెస్‌ నేతలు ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది. అయితే ఆమెకు తమిళనాడు కాంగ్రెస్‌ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్ష పదవిని కట్టబెట్టేందుకు సిద్ధంగా ఉన్నారని ఆ పార్టీ వర్గాలు చెబుతున్నాయి. 2010లో అప్పటి అధికార పార్టీ డీఎంకేలో చేరిన కుష్బూ 2014 ఎన్నికల సమయంలో కాంగ్రెస్‌ గూటికి చేరారు. రాష్ట్రంలో, కేంద్రంలోనూ అధికారానికి దూరంగా ఉండటంతో ఆమెకు ఎలాంటి పదవీ దక్కలేదు.

ఈ క్రమంలో2019 లోక్‌సభ ఎన్నికల్లో ఎంపీ టికెట్‌ ఇవ్వాలని పట్టుబట్టారు. కానీ డీఎంకే -కాంగ్రెస్‌ పొత్తు నేపథ్యంలో సీట్లు సర్దుబాటు కారణంగా ఆమెకు ఎంపీ టికెట్‌ దక్కలేదు. ఆ తర్వాత రాజ్యసభకు పంపుతామని ఎన్నోసార్లు చెప్పినప్పటికీ ఆవేవీ కార్యరూపం దాల్చలేదు. అభిమాన బలం ఎక్కువగా ఉన్నా.. ఆమె పార్టీలో ఉండలేని పరిస్థితి నెలకొన్నట్లు తెలుస్తోంది. కాంగ్రెస్‌లో రాహుల్‌ గాంధీ సపోర్టు ఉన్నా… త అసెంబ్లీ, పార్లమెంట్‌ ఎన్నికల్లో టికెట్‌ దక్కలేక పోటీ చేయలేకపోయారు. కాంగ్రెస్‌, డీఎంకే కూటమిగా కొనసాగడం, గతంలో డీఎంకేతో విభేదించి కాంగ్రెస్‌లో చేరడం వల్లనే డీఎంకే ముఖ్యనేత ఒకరు కుష్బూకు అడ్డుతగులుతున్నట్లు తెలుస్తోంది. ఇక తీవ్ర మనస్థాపానికి గురైన ఆమె.. పార్టీ మారాలని నిర్ణయించుకున్నట్లు ఆమె అనుచరుల ద్వారా సమాచారం.

ఇక ఇటీవల కేంద్రం ప్రవేశపెట్టిన నూతన విద్యావిధానంపై సైతం కుష్బూ ప్రశంసలు కురిపించారు. అయితే రానున్న తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో సత్తాచాటాలని ఎత్తుగడలు వేస్తున్న కమలం పార్టీ, సినీ నటులను పార్టీలో చేర్చుకోవాలని ముందు నుంచే భావిస్తోంది. ఇందులో భాగంగా సూపర్‌ స్టార్‌ రజినీకాంత్‌ను సైతం ఇది వరకు బీజేపీ ఆహ్వానించింది. ఈ క్రమంలోనే కాంగ్రెస్‌ అధిష్టానంపై గుర్రుగా ఉన్న కుష్బూను పార్టీలో చేర్చుకోవాలని ఉవ్విళ్లూరుతోంది. మరీ ఆమె నుంచి ఎలాంటి సమాధానం వస్తుందే వేచి చూడాల్సిందే.

Next Story