కాంగ్రెస్ పార్టీలో మహిళలకు రక్షణ లేదా..?

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  11 Oct 2020 2:42 PM GMT
కాంగ్రెస్ పార్టీలో మహిళలకు రక్షణ లేదా..?

ఓ వైపు హత్రాస్ ఘటనపై కాంగ్రెస్ పార్టీ దేశ వ్యాప్తంగా ఆందోళన కార్యక్రమాలని నిర్వహిస్తోంది. భారతదేశంలో మహిళలకు కనీస రక్షణ లేదని ఆరోపిస్తోంది. కాంగ్రెస్ పార్టీ లోనే మహిళలకు రక్షణ లేకుండా పోయిందని తాజాగా చోటు చేసుకున్న ఘటన ద్వారా స్పష్టమవుతోందని బీజేపీ నాయకులు తీవ్ర విమర్శలు చేస్తూ ఉన్నారు.

ఉత్తరప్రదేశ్ కాంగ్రెస్‌ మహిళా నేత తారా దేవి యాదవ్‌పై పార్టీ కార్యకర్తలు దాడి చేశారు. డియోరియా ప్రాంతంలో శనివారం చోటుచేసుకున్న ఈ ఘటనకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. అత్యాచార ఆరోపణలు ఎదుర్కొంటున్న పార్టీ నాయకుడికి టికెట్‌ ఇవ్వడాన్ని ఆమె ఒప్పుకోకపోవడంతో సదరు టికెట్ పొందిన నాయకుడి వర్గానికి చెందిన కార్యకర్తలు ఆమెపై దాడికి దిగారు.

లైంగికదాడి కేసులో నిందితుడిగా ఉన్న వ్యక్తి ముకుంద్‌ భాస్కర్‌కు ఉప ఎన్నికల్లో పోటీ చేసేందుకు అవకాశం కల్పించకూడదని తారా యాదవ్ నిరసనకు దిగింది. దీంతో అతని అనుచరులు ఆమెపై దాడి చేశారు. 'రౌడీల్లాగా ప్రవర్తించారని.. ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ బాధ్యులపై చర్యలు తీసుకోవాలని' ఆమె కోరుతోంది. ఏది ఏమైనా ఈ ఘటన కాంగ్రెస్ పార్టీకి కూడా షాకింగ్ గా నిలిచింది. బీజేపీ నాయకులు పెద్ద ఎత్తున ఈ ఘటనపై విమర్శలు చేస్తూ ఉన్నారు. ఈ ఘటనపై తారా దేవి పోలీసులకు ఫిర్యాదు చేసింది.

Next Story