నటుడు అనిల్ మురళి హఠాన్మరణం..!

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  30 July 2020 9:03 AM GMT
నటుడు అనిల్ మురళి హఠాన్మరణం..!

మలయాళం నటుడు అనిల్ మురళి మరణించారు. కొచ్చి లోని ప్రైవేట్ ఆసుపత్రిలో అనిల్ మురళి గురువారం నాడు తుది శ్వాస విడిచారు. లివర్ సంబంధిత వ్యాధులతో ఆయన గత కొద్దిరోజులుగా ఇబ్బంది పడుతున్నట్లు తెలుస్తోంది. ఆయన వయసు 56 సంవత్సరాలు. నాని నటించిన 'జెండా పై కపిరాజు' సినిమాలో అనిల్ మురళి కీలక పాత్ర పోషించాడు.

సీరియల్స్ లో నటిస్తూ పేరు సంపాదించుకున్న తర్వాత ఆయన సినిమాల్లో నటించడం మొదలుపెట్టాడు. 1993 లో వచ్చిన 'కన్యాకుమారియిల్ ఒరు కవిత' అనే సినిమా ద్వారా వెండితెరకు పరిచయం అయ్యాడు. 200కు పైగా సినిమాల్లో అనిల్ మురళి నటించాడు. అందులో తమిళం, మలయాళం, తెలుగు భాషల చిత్రాలు ఉన్నాయి.

అనిల్ మురళి క్యారెక్టర్ ఆర్టిస్టుగా, విలన్ గా సక్సెస్ ను అందుకున్నాడు. వాల్కన్నాడి, లయన్, బాబా కల్యాణి, పూతన్ పానమ్, డబుల్ బ్యారెల్, పోకిరి రాజా, రన్ బేబీ రన్ మొదలైన సినిమాల్లో నటించాడు. ఈ ఏడాది విడుదలైన ఫోరెన్సిక్ సినిమాలో కూడా అనిల్ మురళి కీలక పాత్రలో కనిపించాడు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని అభిమానులు, పలువురు ప్రముఖులు సామాజిక మాధ్యమాల్లో పోస్టులు పెడుతున్నారు.

Next Story