అంజిరెడ్డి వద్ద రేవంత్ రెడ్డి ఎంపీ లాడ్స్‌కు సంబంధించిన పేపర్లు
By న్యూస్‌మీటర్ తెలుగు Published on 15 Aug 2020 4:39 PM ISTమేడ్చల్-మల్కాజిగిరి జిల్లా కీసర మండల తహసీల్దార్ ఎర్వ బాలరాజు నాగరాజు పేరు ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. రూ. 2 కోట్ల లంచం డిమాండ్ చేసి రూ. 1.10 కోట్లు తీసుకుంటుండగా అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారులు రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. తహసీల్దార్‌కు లంచం ఇచ్చిన ఇద్దరు రియల్‌ఎస్టేట్ డెవలపర్లను కూడా అరెస్టు చేశారు.
‘‘మాకు వచ్చిన సమాచారం మేరకు దాడులు నిర్వహించాం. సుమోటోగా కేసు నమోదు చేశాం. నాగరాజుతోపాటు.. అవినీతి నిరోధక సవరణ చట్టం మేరకు లంచం ఇచ్చిన అంజిరెడ్డి, శ్రీనాథ్‌లను అరెస్టు చేశాం. రాంపల్లి దాయర్ వీఆర్వో బొంగు సాయిరాజ్‌పైనా కేసు నమోదు చేశాం’’ అని ఏసీబీ అధికారులు తెలిపారు.
ఆయన ఇంట్లో సోదాలు నిర్వహించగా 28 లక్షలు నగదు, బంగారు ఆభరణాలను ఏసీబీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. నాగరాజు బినామీల పేర్లతో భారీగా అక్రమాస్తులు కలిగిఉన్నట్లు ఏసీబీ గుర్తించింది. తహసీల్దార్ బంధువులు, బినామీల ఇళ్లలో కూడా ఏసీబీ సోదాలు నిర్వహించింది.
తహసీల్దార్ నాగరాజుపై మొదటి నుంచీ అవినీతి ఆరోపణలు ఉన్నాయి. రెండేళ్ల క్రితం కూకట్‌పల్లి నుంచి కీసరకు బదిలీపై వచ్చిన ఆయన పెద్ద ఎత్తున అవినీతికి పాల్పడినట్టు ఆరోపణలు ఉన్నాయి. గతంలో చీర్యాల గ్రామానికి చెందిన ఓ రైతు వద్ద రూ.లక్ష డిమాండ్ చేయడంతో ఆ రైతు ఆత్మహత్యకు పాల్పడ్డారు. దీంతో అతడి కుటుంబ సభ్యులు తహశీల్దార్ కార్యాలయానికి వచ్చిన నాగరాజును నిలదీశారు. ఈ కేసులో తవ్వేకొద్దీ అక్రమాస్తులు బయటపడుతున్నాయి. తహసీల్దార్ నాగరాజు ఆస్తుల విలువ రూ.100 కోట్ల పైనే ఉంటుందని ఏసీబీ అధికారులు అంచనా వేశారు. హైదరాబాదు శివారు ప్రాంతాల్లో పెద్ద ఎత్తున ఆస్తులు కొనుగోలు చేసినట్టు గుర్తించారు.
అంజిరెడ్డి వద్ద కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డికి సంబంధించిన ఎంపీ లాడ్స్ పేపర్స్ కూడా దొరికినట్లు సమాచారం అందింది. ఈ కేసులో రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడ్డ అంజిరెడ్డి వద్ద రేవంత్ రెడ్డికి సంబంధించిన ఎంపీ లాడ్స్ రెకమెండేషన్ పేపర్లు ఉన్నట్లు తెలుస్తోంది. రూల్స్ ప్రకారం ఆ డాక్యుమెంట్స్ ఎంపీ కలెక్టర్ కు ఇవ్వాల్సి ఉంది.. కానీ అంజిరెడ్డి దగ్గరకు అవి ఎలా వచ్చాయా అన్నదానిపై అధికారులు ఆరా తీస్తున్నారు.