స‌ల్మాన్ నా భ‌విష్య‌త్‌ను నాశ‌నం చేశాడు

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  16 Jun 2020 11:16 AM GMT
స‌ల్మాన్ నా భ‌విష్య‌త్‌ను నాశ‌నం చేశాడు

బాలీవుడ్‌ హీరో సుశాంత్‌​ సింగ్‌ రాజ్‌పుత్ ఆత్మ‌హ‌త్య అంద‌ర‌నీ క‌లిచివేసింది. ఈ క్రమంలో ఇండస్ట్రీలో బ‌లంగా నాటుకుపోయిన విర‌స‌త్వంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. చాలామంది ప్ర‌ముఖులు, నెటిజ‌న్లు బహిరంగంగా దీనిపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ స‌మ‌యంలోనే ద‌బాంగ్‌‌ దర్శకుడు అభినవ్‌ కశ్యప్‌ పలు సంచలన ఆరోపణలు చేశారు. ఈ ఆరోప‌ణ‌లు ఇప్పుడు బాలీవుడ్ తీవ్ర దుమారాన్ని రేపుతున్నాయి. ఫేస్‌బుక్‌ వేదికగా సుశాంత్‌ మృతికి సంతాపం తెలిపిన అభినవ్.. అత‌ని మ‌ర‌ణంపై ప్ర‌భుత్వం సమగ్ర దర్యాప్తు చేయాల‌ని కోరాడు‌.

2010లో సల్మాన్ ఖాన్ హీరోగా న‌టించి విజ‌య‌వంత‌మైన‌ దబాంగ్‌ చిత్రానికి అభినవ్‌ దర్శకత్వం వహించాడు. ఆ త‌ర్వాత ద‌బాంగ్ సీక్వెల్‌కు కూడా అతనే దర్శకత్వం వహించాల్సి ఉంది. కానీ.. సల్మాన్ ఖాన్‌‌, అతని కుటుంబ సభ్యులు కెరీర్‌ను నాశనం చేశారని అభినవ్‌ కశ్యప్‌ ఆరోపించారు.

S1

తాను ద‌బాంగ్ సీక్వెల్‌కు ద‌ర్శ‌క‌త్వం వ‌హించ‌క‌పోవ‌డానికి సల్మాన్‌ సోదరులు అర్బాజ్, సోహైల్ ఖాన్‌లే కారణమ‌ని.. వారు తనని బెదిరించడం ద్వారా తన కెరీర్‌ను నియంత్రించాడనికి ప్రయత్నించారని అభిన‌వ్ ఆ పేస్‌బుక్ సందేశంలో ఆరోపించారు. అయితే.. తాను అందుకు అవకాశం ఇవ్వకపోవడంతో తన భవిష్యత్తును నాశనం చేసి సల్మాన్‌ ఖాన్‌ కుటుంబం ప్రతీకారం తీర్చుకుంద‌ని పేర్కొన్నారు. అయితే.. 2013లో తాను‌ దర్శకత్వం వహించిన చిత్రం ‘బేషర‌మ్‌’ చిత్రం విడుదలను అడ్డుకునేందుకు సల్మాన్‌, అతడి కుటుంబం అన్ని రకాల ప్రయత్నాలు చేశారని అభినవ్‌ ఆరోపించాడు.

త‌న‌ శత్రువులెవ‌రో తెలుస‌న్న అభిన‌వ్‌.. వారి గురించి అందరికి తెలియాలని.. వారే సలీం ఖాన్, సల్మాన్ ఖాన్, అర్బాజ్ ఖాన్, సోహైల్ ఖాన్ లంటూ ఆరోపించారు. వారు తనను మెసేజ్‌ల ద్వారా బెదిరించేవార‌ని.. అలాంటివారు తమ కంటూ ఓ కెరీర్‌ను ఏ‍ర్పర్చుకోకుండా.. అవ‌త‌లి వాళ్ల‌ జీవితాన్ని, భవిష్యత్తును నాశనం చేస్తారని విమ‌ర్శించారు.

Next Story