నిలువెత్తు స్పూర్తి : 'ఇంతి'తై ఎదిగి.. ఉన్నత కొలువులో ఒదిగి
By మధుసూదనరావు రామదుర్గం Published on 28 July 2020 9:19 AM GMTఆర్తి డోగ్రే సొంతూరు.. ఉత్తరాఖండ్‌లోని డెహ్రాడూన్. తండ్రి రాజేందర్ సైనికాధికారి. తల్లి కుమ్‌కుమ్ కళాశాల ప్రిన్సిపల్. ఆర్తి మూడడుగుల ఎత్తు వరకే పెరిగి ఆగిపోయింది. ఎత్తు పెరగలేదని బుద్ధి పెరగకుండా ఆగదు కదా! పొట్టిగా ఉండటమే తన సమస్య అని మొదటే గుర్తించి.. న్యూనత భావన నుంచి బైట పడటానికి తీవ్రంగా ప్రయత్నించింది. ఇందుకు తల్లిదండ్రులు మనస్ఫూర్తిగా సహకరించారు. మొదట్లో తమ బిడ్డ పొడగరి కాకపోయిందని కాసింత కలత చెందినా వెంటనే తేరుకున్నారు. మొదట్లో తలిదండ్రులకు మున్ముందు ఎలాగో అనిపించేది. చుట్టు పక్కల వాళ్లు.. అమ్మాయి మీద మీ ఆశలు పెరుగుతున్నాయే గానీ ఆమె ఎత్తు పెరగడం లేదు. మరో బిడ్డను కనొచ్చుగా.. అంటూ ఓ ఉచిత సలహా పడేశారు. మరేం పర్వాలేదు మా అమ్మాయిపై మాకు కొండత నమ్మకం ఉందని వారు చాల ఓర్పుతో బదులిచ్చేవారు. ఆర్తి వారి ఆశల్ని నూటికి నూరు శాతం నిజం చేసింది. కష్టించి ఐఏఎస్ చదివి కలెక్టర్ కొలువును అందుకుంది. ఎందరికో స్ఫూర్తిగా నిలిచిన ఆర్తి విజయగాధ ఇది!
ఆర్తి డోగ్రే తన ఊహ తెలిసినప్పటి నుంచి ఎన్నో అవమానాలు ఎదుర్కొంది. తన వెనక వెక్కిరింపులూ వింది. అయితే ఎటువంటి పరిస్థితిలోనూ తన మనోధైర్యాన్ని మాత్రం జారవిడుచుకోలేదు. వెక్కిరించిన విధిని ధిక్కరించి ఆత్మవిశ్వాసమే ఆయుధంగా ముందుకు సాగింది. తల్లిదండ్రుల అండదండలుండటంతో ఎవరేమనుకున్నా కుంగిపోలేదు. ఆర్తిని చూసిన డాక్టర్లు తనను ప్రత్యేక పాఠశాలలో చేర్పించండి.. మీకు కాస్త బాధ్యతబరువు తగ్గుతుందని చెప్పారు. బంధువుల సలహాలకు కొదవే లేదు. ఏకంగా పాపను అనాథశరణాలయానికి పంపండి అంటూ అమానవీయంగా మాట్లాడారు. అయితే ఈ సూటిపోటి మాటలకు వారు ఏమాత్రం బెదరలేదు. తమ బిడ్డను స్పెషల్ స్కూల్లో వేయలేదు. తామే దగ్గరుండి ధైర్యాన్ని నూరిపోశారు. సాధారణ పాఠశాలలోనే అందరితోపాటు చదువుకునే ఆత్మస్థైర్యం ఆమెలో ప్రోది చేశారు.
డెహరాడూన్‌లో వెల్హమ్ బాలికల పాఠశాలలో ఆర్తి తన చదువు పూర్తి చేసింది. ఢిల్లీలోని లేడీ శ్రీరామ్ కాలేజీలో డిగ్రీ పూర్తి చేశాక పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేయాలనుకుంది. ఆ సమయంలోనే డెహరాడూన్ నుంచి మొదటిసారిగా ఐఏఎస్ సాధించిన మనీషాతో అనుకోకుండా పరిచయం కలిగింది. అక్కడే ఆమె ఆలోచనలు ఒక మలుపు తిరిగాయి. మనీషాలా తను ఎందుకు ఐఏఎస్ చదివి కలెక్టర్ కారాదు అనుకుంది. కేవలం అనుకుని మిన్నకుంటే తను ఆర్తి ఎందుకవుతుంది. కొత్త లక్ష్యాన్ని సాధించుకునేందుకు నిరంతరం శ్రమించింది. తొలి ప్రయత్నంలోనే 56 వ ర్యాంకు సొంతం చేసుకుంది. ఆ తర్వాత కొన్నాళ్ళు అజ్మీర్ కలెక్టర్‌గా పనిచేసింది. అనంతరం జోద్‌పూర్ డిస్కమ్ మేనేజింగ్ డైరెక్టర్‌గా కీలక పదవి అందుకుంది. ఆర్తి చదువులో ఎంత కష్టపడిందో.. ఉన్నత పదవుల్లో బాధ్యతల్ని నిర్వర్తించడానికి అంతకన్నా ఎక్కువగా కష్టించింది. సమర్థంగా ఎన్నికలు నిర్వహించి రాష్ట్రపతి ప్రశంసలు అందుకుంది. ఈ ప్రస్థానంలో ఆర్తి ఏనాడు తన పెదాలపై చిరునవ్వును చెదరనీయలేదు.
వైకల్యం ఎంతటి మానసిక కష్టాన్నిస్తుందో ఆర్తికి బాగా తెలుసు. అందుకే దివ్యాంగులు తమ ఓటు వేసేందుకు వీలుగా దివ్యాంగ రథాలంటూ 874 వీల్ చైర్‌లను ఏర్పాటు చేశారు. అందుకే గత ఎన్నికల్లో సుమారు 17వేలమంది దివ్యాంగులు తమ ఓటుహక్కును వినియోగించుకున్నారు. అంతేకాదు బికనేర్ జిల్లా కలెక్టర్‌గా ఉన్నప్పుడు బహిరంగ మలవిసర్జనకు అడ్డుకట్ట వేసేందుకు ‘బుంకో బికానో’ అంటూ పెద్ద ఎత్తున ప్రచారం చేపట్టారు.
అమ్మ తిట్టిందనో.. నాన్న అరిచాడనో.. పరీక్ష ఫయిల్ అయ్యమనో.. ప్రేమ విఫలమైందనో.. చిన్నచిన్న వాటినే పెద్ద సమస్యలుగా ఊహించి ఇక బతికీ దండగ అనుకుంటూ తనువులు చాలించే వారికి ఆర్తి డోగ్రా ఒక సజీవ స్ఫూర్తి.. కాదంటారా!!