గుండెనిండా ధైర్యం.. అదే దారి దీపం..!

By మధుసూదనరావు రామదుర్గం  Published on  27 July 2020 5:23 PM GMT
గుండెనిండా ధైర్యం.. అదే దారి దీపం..!

గంపెడంత కుటుంబం.. చేసేది కూరగాయల వ్యాపారం. బతుకుతున్నది భాగ్యనగరంలో.. పట్టువీడని పేదరికం.. కష్టాలతోనే స్నేహం.. అయినా చదువులమ్మ కటాక్షం పుష్కలం. ముగ్గురమ్మాయిలు బీటెక్కులే! సాఫ్ట్‌వేర్‌ శారదాగా నిన్న మీడియాలో అందరికీ పరిచయమైన వర్ధన్నపేట అమ్మాయి విజయగాథ ఇది!!

టెన్త్‌ నుంచి బీటెక్‌ దాకా అన్ని తరగతుల్లోనూ అత్యధిక మార్కులు సాధించిన శారదకు తొలుత ఢిల్లీలో కొలువు వచ్చింది. కొన్నాళ్లు అక్కడ చేశాక హైదరాబాద్‌ అయితే అమ్మానాన్నలతో ఉండవచ్చని వచ్చేసింది. కార్మికనగర్‌కు దగ్గరలోని ఎస్‌పీఆర్‌ హిల్స్‌లో అద్దె ఇంట్లో ఉంటున్న శారద భాగ్యనగరంలో తన భాగ్యాన్ని పరీక్షించుకుందామనుకుంది. కొద్దిపాటి ప్రయత్నంతో వెంటనే మరో ఐటీ కంపెనీలో ఉద్యోగం దొరికింది. అంతా బాగుంది అనుకుం టున్న సమయంలో కరోనా వచ్చిపడింది. దేశంలో మహా ఆర్థిక సంక్షోభం. కొత్త ఉద్యోగాల మాట అటుంచితే.. ఉన్న కొలువులు కొండెక్కాయి. చాలా కంపెనీలు కష్టాలు తట్టుకోలేక ఉద్యోగుల్ని వదులుకున్నాయి. శారద చేస్తున్న ఉద్యోగం కూడా ఆ విధంగా కరోనార్పణం అయిపోయింది. ఇదంతా ఉద్యోగం చేరిన మూడు నెలలకే! ఆఫీసులో అధికారుల తమ నిస్సహాయత వ్యక్తం చేస్తే మీరేం చేస్తారులేండి.. ఇది ప్రపంచానికి వచ్చిన పెద్ద కష్టం అని బదులిచ్చి ఇంటికి వచ్చేసింది.

జీవితంలో అన్నీ మనం అనుకున్నవే దొరకవు. దొరికిన వాటితో మనం సర్దుకుపో తప్పదు అని తనకు తానే సర్ది చెప్పుకుంది. ఇంటికైతే వచ్చింది కానీ తను ఇరవైఏళ్లుగా శ్రమించిన చదువుల ఫలితంగా దక్కిన ఉద్యోగం ఇలా అనుకోని విపత్తుతో కొట్టుకు పోవడాన్ని జీర్ణం చేసుకోలేక పోయింది. రాత్రంతా మనసారా ఏడ్చింది. తెల్లారగానే మనసులో భారం పూర్తిగా దిగిపోయింది. మొదటిసారిగా కన్నీళ్లకు ఇంత శక్తి ఉంటుందా అనిపించింది శారదకు. గతం గతః ఇప్పడేం చేయాలి అని అనుకోగానే.. కూరగాయల అమ్మకం కళ్లెదుట కనిపించింది. ఇంకో క్షణం ఆలోచించలేదు. అమ్మా నాన్నల్ని కూర్చోబెట్టి అసలు విషయం చెప్పింది. ఇంత చదువు చదివి ఇదెందుకమ్మా.. అంటే మరేం ఫరవాలేదు. మనం నీతిగా చేసే ప్రతి పనికి అందరి మద్దతు కచ్చితంగా ఉంటుందని తేల్చి చెప్పింది.

అన్నయ్యతో కలిసి వ్యాపారం మొదలు పెట్టింది. దుకాణాన్ని విస్తరించింది. మొదట్లో కొందరు ఆశ్చర్యపోయినా తనకు పాఠంచెప్పిన టీచర్లు, కాలేజీ లెక్చరర్లు, తన స్నేహితులు అందరూ శారద నిర్ణయాన్ని గౌరవిస్తూ కాయగూరలు ప్రేమగా కొనడం ప్రారంభించారు. అమ్మానాన్నలకు ఇక పనులు చేయకండి మేం చూసుకుంటామని చెప్పింది. అయితే సంపాదించిన దాంట్లో పద్దెమొత్తం అద్దెకివ్వాలంటేనే మనసుకు కష్టంగా ఉంటుందని శారద తెలిపింది. ‘ఇన్నాళ్లు అమ్మానాన్న దొరికిన పనులు చేస్తూ ఇంతింత అద్దె చెల్లిస్తూ ఎలా బతుకుబండిని లాగారా అనిపిస్తుంది. నాన్న వాచ్‌మెన్‌గా కొన్నాళ్ళు పనిచేసినా ఆ తర్వాత కూరగాయల బండి పెట్టాడు. ఆ బండితోనే ఇంత పెద్ద కుటుంబానికి భరోసాగా ఉన్నప్పుడు.. నేనెందుకు ఆలోచించాలి అనుకున్నా! నేను ఎలాగైనా అడవిలోనైనా బతికేయగలను. కానీ కుటుంబానికి అండగా నిలవాలనే నా తపన అంతా’ అంటూ తెలిపింది.

అదో సరస్వతీ కుటుంబం

శారద ఒక్కతే కాదు ఆమె అక్క ఎంటెక్‌ చేసి వరంగల్‌లో వాగ్దేవి ఇంజనీరింగ్‌ కాలేజీలో అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌గా పనిచేస్తున్నారు. చెల్లి బీటెక్‌ చేశాక కేర్‌ ఆస్పత్రిలో ఇన్సురెన్స్‌ పాలసీ మేకర్‌గా పనిచేస్తున్నారు. అన్నయ్య మాత్రం టెన్త్‌తో చదువు ఆపేశాడు. శారద తండ్రి వెంకటయ్య, తల్లి సరోజమ్మలు మొదట్లో ఊర్లోనే వ్యవసాయం చేసేవారు. అయితే పిల్లల చదువుల కోసం హైదరాబాద్‌ వచ్చేశారు. ‘మేం బాగా చదువుకుంటుండంతో మా ఇంటిదగ్గరుండే గోవిందరెడ్డి సార్, మరోమేడమ్‌లు మాకు ఆర్థికంగా సాయం చేసేవారు. నాకు నాలుగోతరగతిలో థర్డ్‌ ర్యాంకు వచ్చింది. మిగిలన వారందరూ నన్ను ప్రత్యేకంగా చూడటంతో ర్యాంకు వస్తే ఆ మజాఏంటో అర్థమైంది. టెన్త్‌లో డెబ్భైశాతం వచ్చింది. అయితే ఇది సరిపోదనిపించి మరింత కష్ట పడ్డా ఇంటర్‌లో ఎనభైశాతం వచ్చింది. బీటెక్‌ ఫ్రీ సీటు వచ్చింది. నాకే కాదు అక్కకు మా చెల్లికి కూడా అలాగే వచ్చాయి. దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖరరెడ్డి పుణ్యమా అని ఫీజు రీఎంబర్స్‌మెంట్‌ పథకం వచ్చింది. సరస్వతీ దేవికి మా ఇల్లు పుట్టినిల్లయింది..’ అంటూ తన గతాన్ని మనసారా స్మరించుకుంది శారద.

తాజాగా తను కూరగాయలమ్మడం ప్రముఖ టీవీ ఛానెల్‌లో ప్రసారం కావడంతోపాటు సోషల్‌ మీడియాలో వైరల్‌ కావడంతో శారద పేరు అందరి నోట్లో నానుతోంది.

.

సోనుసూద్‌ సాయహస్తం

టీవీలో, సోషల్‌ మీడియాలో శారద కష్టాల గాథ చూసిన సోనుసూద్‌ వెంటనే ఆమెకు ఉద్యోగం వచ్చేదాకా కుటంబానికి అండగా నిలుస్తానని ట్వీట్‌ చేశాడు. ఈ అభినవ కర్ణుడి ఉత్సాహం ముందు దానం అనేది చాలా చిన్నపదం అవుతోంది. సాహిత్యంలో దానం గొప్పదనాన్ని చాలా మంది వర్ణించారు..‘ఆకుంటే వృక్షంబగు.. ఈకుంటే లోభియగు హీనరుడౌ, మాకుంటే మేము రాము, మీకుంటే మాకు ఇమ్మా..’ అని చమత్కారంగా పద్యమే చెప్పారు. శిబి, బలి చక్రవర్తులు కేవలం దాన గుణాదుల వల్లే చరిత్రలో నిలిచిపోయారు. సోనుసూద్‌ చక్రవర్తి కాకపోవచ్చు. కానీ ముమ్మాటికీ మనసున్న మహారాజే! ఇతరులకు సాయం చేసేందుకయినా ఆయన చల్లగా ఉండాలని ప్రజలు కోరుకుంటున్నారు.!!

Next Story