సూర్య సినిమాకు 60 కోట్ల డీల్
By న్యూస్‌మీటర్ తెలుగు Published on 24 Aug 2020 10:43 AM ISTకోలీవుడ్ సూపర్ స్టార్లలో ఒకడైన సూర్య రెండు రోజుల కిందట పెద్ద షాకే ఇచ్చాడు. అతడి కొత్త సినిమా ‘సూరారై పొట్రు’ (తెలుగులో ఆకాశమే నీ హద్దురా)ను నేరుగా థియేటర్లలో కాకుండా డిజిటల్ స్ట్రీమింగ్ ఫ్లాట్ ఫామ్ ‘అమేజాన్ ప్రైమ్’లో రిలీజ్ చేయబోతున్నట్లు ప్రకటించాడు. ఈ చిత్రానికి సూర్య హీరో మాత్రమే కాదు.. నిర్మాత కూడా. అతడి 2డీ ఎంటర్టైన్మెంట్ బేనర్ మీదే ఈ సినిమా తెరకెక్కింది.
కరోనా లేకపోతే వేసవిలోనే ఈ సినిమా విడుదల కావాల్సింది. లాక్ డౌన్ మొదలవ్వడానికి ముందే చిత్రీకరణ పూర్తయింది. కొంత పోస్ట్ ప్రొడక్షన్ పని మిగిలితే దాన్నీ ఈ మధ్యే పూర్తి చేశారు. ఐతే పరిస్థితులు మెరుగపడతాయి. థియేటర్లు తెరుచుకుంటాయి. సినిమాలు మళ్లీ ఒకప్పటిలా ఆడతాయి అని చూసి చూసి చివరికి విసుగెత్తిపోయి ఈ చిత్రాన్ని ఓటీటీలో నేరుగా రిలీజ్ చేసేయడానికి సూర్య రెడీ అయిపోయాడు. తెలుగమ్మాయి సుధ కొంగర రూపొందించిన ఈ చిత్రం అక్టోబరు 30న ప్రైమ్‌లోకి రానుంది.
సౌత్ ఇండియాలో నేరుగా ఓటీటీలో రిలీజవుతున్న అతి పెద్ద సినిమా ఇదే. తెలుగులో ఈ మధ్యే ‘వి’ సినిమాను ప్రైమ్‌కు అమ్మేసిన సంగతి తెలిసిందే. సెప్టెంబరు 5న ఆ చిత్రం విడుదల కానుంది. ఆ చిత్రాన్ని రూ.32 కోట్లకు అమ్మినట్లు వార్తలొచ్చాయి. మరి దాంతో పోలిస్తే సూర్య సినిమా చాలా పెద్దది. దీనికెంత రేటు పలికి ఉండొచ్చన్నది ఆసక్తికరం. ఆ మొత్తం రూ.60 కోట్లన్నది విశ్వసనీయ వర్గాల సమాచారం.
‘సూరారై పొట్రు’ చిత్రీకరణ దశలోనే.. దీని డిజిటల్ హక్కులను ప్రైమ్ వాళ్లకు సూర్య రూ.20 కోట్లకు అమ్మాడట. ఇప్పుడు థియేట్రికల్ రిలీజ్ లేకుండా సినిమా హక్కులను ఆ సంస్థ తీసుకుంది. ఇందుకోసం అదనంగా రూ.40 కోట్లు ఇచ్చిందట. ఈ మొత్తం చెల్లించే హక్కులు సొంతం చేసుకుంది. తర్వాత థియేటర్లు తెరుచుకున్నప్పటికీ అక్కడ ఈ సినిమాను విడుదల చేయరు. ఇంకా శాటిలైట్, హిందీ డబ్బింగ్ హక్కుల ద్వారా సూర్యకు ఆదాయం బాగానే వచ్చిందని, మంచి లాభాలే మిగుల్చుకున్నాడని అంటున్నారు.