డబ్బులకు కొదవ లేదు.. తెలంగాణ ధనిక రాష్ట్రమే : కేసీఆర్
By తోట వంశీ కుమార్ Published on 25 Jun 2020 10:46 AM GMTతెలంగాణ ధనిక రాష్ట్రమేనని మరోసారి స్పష్టం చేశారు సీఎం కేసీఆర్. మెదక్ జిల్లా నర్సాపూర్‌లో మొక్కలు నాటి ఆరోవిడత హరితహారం కార్యక్రమాన్ని గురువారం సీఎం ప్రారంభించారు. అనంతరం 630 ఎకరాల్లో ఏర్పాటు చేసిన అర్భన్ ఫారెస్ట్‌ను ప్రారంభించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి కేసీఆర్ మాట్లాడుతూ.. పచ్చదనం పరిరక్షణ మనందరి బాధ్యత అని, ప్రజాప్రతినిధులు పచ్చదనాన్ని పెంచేందుకు కృషి చేయాలన్నారు. 92వేల ఎకరాల అడవిని పోగొట్టుకున్నామన్నారు. ఒకప్పుడు సినిమా షూటింగ్‌ల కోసం నర్సాపూర్ అటవీ ప్రాంతాన్నే ఎంపిక చేసుకునేవారని, గతంలో నర్పపూర్ అడవుల్లో చాలా సినిమాలు షూటింగ్ లు జరిగాయన్నారు. మెదక్ జిల్లాలో అడవులు ఎక్కువగా ఉన్నాయని, వాటికి కాపాడుకునే బాధ్యత అందరిపై ఉందన్నారు. ప్రతి గ్రామంలో నర్సరీ ఉన్న ఏకైక రాష్ట్రం తెలంగాణే అన్నారు. తెలంగాణ ధనిక రాష్ట్రమని, అభివృద్ది పనులకు డబ్బుల కొరత లేదన్నారు.
లాక్‌డౌన్ వల్ల ఉద్యోగులకు మూడు నెలలు జీతాలు ఇవ్వలేదు. కానీ ఇప్పడు ఆర్థిక పరిస్థితి బాగుందని, తెలంగాణ ముమ్మాటికి ధనిక రాష్ట్రమేనని, ఇందులో డౌటే లేదన్నారు. ఇది అధికారికంగా చెబుతున్నా. ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు తెలంగాణ కావాలంటే మీకు పాలనరాదు అన్నారు. కానీ ఇప్పుడు దేశానికి అన్నం పెట్టే రాష్ట్రంగా తెలంగాణ మారిందన్నారు. ఈ విషయాన్ని స్వయంగా ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎఫ్‌సీఐ) చెప్పింది. మన పాలన మనం చేయడం వల్లే ఈ ఫలితం వచ్చింది. మిషన్ భగీరథ నీళ్లు వస్తాయంటే ఎవరైనా నమ్మారా? కానీ వచ్చాయి. రాష్ట్రంలో ఒకప్పుడు విద్యుత్ సమస్యలు ఉండేది కానీ ఇప్పుడు 24 గంటలు కరెంట్ ఉంటుంది. ఈ ఏడాదిలోనే సంగారెడ్డికి కాలేళ్వరం నీళ్లు వస్తాయి. ఇలా అన్ని సమస్యలను తీర్చుకుంటూ రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకుందాం’ అని సీఎం కేసీఆర్ అన్నారు.
కలప దొంగలను క్షమించే ప్రసక్తేలేదన్నారు. కలప స్మగర్ల ఆటకట్టించేందుకు ఇంటెలిజెన్స్‌లో ప్రత్యేక విభాగం ఏర్పాటు చేశామన్నారు. ఇకపై కలప స్మగ్లర్లను దేశంలో ఎవడూ కాపాడలేడన్నారు. చీమ చిటుక్కుమన్నా తనకు సమాచారం వస్తుందని, వెంటనే చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. దేశంలో 55శాతం ధాన్యం తెలంగాణలో పండిందని, సాగునీరు, రైతుబంధు సాయంతో రైతుల్లో ధైర్యం వచ్చిందన్నారు. ఒకప్పుడు గ్రామాల వాళ్లు హైరాబాద్ వైపు చూసేవారని, కానీ ఇప్పుడు హైదరాబాద్‌లో ఉన్న వాళ్లు కూడా మళ్లీ గ్రామాల వైపు చూస్తున్నారన్నారు. రైతు బాగుపడితేనే రాష్ట్రం అభివృద్ది చెందుతుంది. సంకల్పం ఉంటే అన్నీ సమకూరుతాయన్నారు. నేను మొండి వాణ్ని అనుకుంటే పట్టుబడతా.. సాధిస్తా నని కేసీఆర్ తెలిపారు.
ర్సాపూర్ నియోజకవర్గంలో ప్రతి గ్రామ పంచాయతీకి 20 లక్షలు మంజూరీ చేస్తున్నామని చెప్పారు. ఏడు మండలాలకు ఏడు కోట్లు.. నర్సాపూర్ మున్సిపాల్టీకి రూ. 25 కోట్లు మంజూరు చేస్తున్నామన్నారు. జహీరాబాద్ , నారాయణఖేడ్‌లకు లిఫ్ట్‌ల ద్వారా నీళ్లిస్తామన్నారు. అన్ని నియోజకవర్గాలకు నీరిస్తామని కేసీఆర్ స్పష్టం చేశారు. నర్సాపూర్‌లో నెతలందరూ ఒకటయ్యారని, ఇక ఇబ్బంది లేదన్నారు. అందరూ కలిసి నియోజకవర్గాన్ని ఆద్భుతంగా చేయండని పిలుపు ఇచ్చారు. అన్ని రకాల రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తామన్నారు.