మరో 275 చైనా యాప్‌లపై వేటు..? ఇప్పటికీ 59 యాప్‌లను నిషేధించిన భారత్‌

By మధుసూదనరావు రామదుర్గం  Published on  27 July 2020 3:16 PM IST
మరో 275 చైనా యాప్‌లపై వేటు..? ఇప్పటికీ 59 యాప్‌లను నిషేధించిన భారత్‌

దేశ సెక్యూరిటీకి భంగం కలిగిస్తాయన్న ఆలోచనతో 59 చైనా యాప్‌లతోపాటు దేశంలో బాగా వాడుకలో ఉన్న టిక్‌టాక్‌ యాప్‌ను కూడా గత నెలలో నిషేధించిన భారత్..‌ మరో 275 యాప్‌లను నిషేధించాలా వద్దా అని పరిశీలించేందుకు సిద్దమైంది. యాప్‌లు నిబంధనల ప్రకారమే ఉంటున్నాయా.. ఉల్లంఘనలు ఏవైనా ఉన్నాయా అని నిశితంగా పరిశీలించనుంది. దేశభద్రతతోపాటు వినియోగదారుల వ్యక్తిగత సమాచారానికి ఇబ్బంది అనిపించినా మరో మాట లేకుండా యాప్‌లపై వేటేయడం ఖాయం.

చైనా‌ కంపెనీలకు సంబంధించి ఇలా వరసగా నిషేధించడం ద్వారా భారత్‌ దేశభద్రతకు సంబంధించి సీరియస్‌గా ఉంటోందన్న సందేశం చైనాకు ఇవ్వగలుగు తోంది. ఆసియాలోని రెండు పెద్దదేశాలు భారత్‌–చైనా సరిహద్దులో ఘర్షించుకుంటున్న నేపథ్యంలో భారత్‌ చేపడుతున్న ఈ యాప్‌ నిషేధాల చర్యలకు ఎక్కడ లేని ప్రాధాన్యం లభిస్తోంది.

లెక్కకు మిక్కిలిగా విదేశీ యాప్‌లను ఈటీ లోతుగా పరిశీలిస్తోంది. ఈ జాబితాలో టాప్‌ గేమింగ్‌ యాప్‌ పబ్జి కూడా ఉంది. ఈ యాప్‌ను చైనాలోని పెద్ద ఇంటర్నెట్‌ కంపెనీ సపోర్ట్‌ చేస్తోంది. అలాగే గ్జియోమీ పోన్‌ తయారు చేస్తున్న కంపెనీకి సంబంధించిన జిల్, ఈ కామర్స్‌ దిగ్గజం అలీబాబాకు సంబంధించిన అలిఎక్స్‌ప్రెస్‌తో పాటు ప్రసిద్ధ యాప్‌ టిక్‌టాక్‌ అందిస్తున్న కంపెనీకి సంబంధించిన రెస్సో,యూలైక్‌ యాప్‌లు జాబితాలో ఉన్నాయి. ప్రభుత్వం జాబితాలోని అన్నియాప్‌లను నిషేధించవచ్చు. లేదా వీటిలో కొన్నిటిపై వేటు పడవచ్చు. ఇవేవీ కాకుండా జాబితాలోని యాప్‌లన్నింటిపై సంతృప్తి వ్యక్తం చేయవచ్చు.

ఈ పరిణామంపై ఈటీ ఆరా తీసినా, కేంద్ర హోం మంత్రిత్వశాఖ అధికార ప్రతినిధి స్పందించడం లేదని తెలుస్తోంది. చైనా ఆర్థికసాయంతో నడుస్తున్న కంపెనీల యాప్‌ల పరిశీలనే లక్ష్యంగా ఉన్నట్లు ఆధికారిక సమాచారం. ‘ఇప్పటికే భద్రతా కారణాల రీత్యా కొన్ని యాప్‌లపై వేటు వేయగా, నిబంధనలు ఉల్లంఘనల కారణాలతో మరి కొన్ని డేటా షేరింగ్‌లో నిబంధనలు పాటించడం లేదని అధికార వర్గాలు అంటున్నాయి. కొన్ని యాప్‌ల నుంచి మన డేటా చైనాకు వెళుతోందని, ఇది దేశ సార్వభౌమత్వాన్ని, జాతీయ సమగ్రతను దెబ్బతీసేవే అని తెలుస్తోంది. చైనాకు చెందిన కంపెనీలకు మన డేటాషేర్‌ అవుతోంది.

అంతేకాదు యాప్‌ కంపెనీలు ఎక్కడ నుంచి కార్యకలాపాలు నిర్వహిస్తున్నా డేటా చైనాదేశానికి అందుతున్నట్టు ఆధికార వర్గాలు భావిస్తున్నాయి. లద్దాఖ్‌లో చైనా సైనికులు మన సైన్యంపై అనవసరంగా ఘర్షించిన తర్వాత ఈ విధమైన కఠిన నిబంధనల్ని తెరపైకి కేంద్రం తీసుకొచ్చింది. చైనా ఈ చర్యల్ని విమర్శిస్తోంది. ఇరు దేశాల వాణిజ్య సంబంధాలు దెబ్బతీసేలా యాప్‌లను నిషేధించడం సరికాదని తెలిపింది. ఈ విషయాన్ని చైనా సీరియస్‌గా తీసుకుంటున్నట్టు తెలుస్తోంది.

భారత్‌పై అనవసరంగా కాలు దువ్వి కవ్వించిని చైనాకు ప్రస్తుతం చేదు అనుభవాలు ఎదురవుతున్నాయి. ప్రపంచంలో అతిపెద్ద మార్కెటింగ్‌ దేశం మన భారత్‌. ఇప్పటి దాకా చైనా చాలా విస్తృతంగా మనదేశంలో తన ఐటీ టెక్నాలజీని, ఇతరేతర వస్తువుల్ని...ఆఖరుకు టపాసుల్ని కూడా అమ్ముకుంటోంది. ఇంతటి వ్యాపార లావాదేవీలు ఉన్నప్పుడు భారత్‌తో సత్సంబంధాలు పెంచుకోవాలన్న సహృదయత, సంయమనం మాత్రం చైనాకు లేదనిపిస్తోంది.

పైగా ప్రపంచదేశాలు కరోనా ధాటికి వణికిపోతూ ఈ గండం నుంచి గట్టెక్కితే చాలురా అనుకుంటుంటే.. సమయం సందర్భం చూసుకోకుండా చైనా భారత్‌పై దాడికి ప్రయత్నించడం ద్వారా తన వంకర బుద్ధిని చూపింది. అయితే అప్పుడెప్పుడో చైనాతో తలపడలేక మిన్నకుండినట్టుగా భారత్‌ ఇప్పడు ఊరికే ఉండదని బదలా తీర్చుకుంటుందని కేంద్రం యాప్‌ల నిషేధంతో చెప్పకనే చెబుతోంది.

Next Story