పుల్వామా ఉగ్ర‌దాడిలో 23ఏళ్ల యువ‌తి హ‌స్తం

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  27 Aug 2020 3:46 AM GMT
పుల్వామా ఉగ్ర‌దాడిలో 23ఏళ్ల యువ‌తి హ‌స్తం

జమ్మూకశ్మీర్ పుల్వామా దాడి కేసులో చార్జీషీట్ దాఖలు అయ్యింది. జైషే మహ్మద్ చీఫ్ మసూద్ అజహర్‌తో పాటు 15 మందిపై చార్జిషీట్‌లో చేర్చింది జాతీయ దర్యాప్తు బృందం (ఎన్‌ఐఏ). కాగా పుల్వామా దాడికి మసూద్ అజర్‌తో పాటు అతడి సోదరుడు రౌఫ్ అస్గర్‌లే ప్రధాన సూత్రధారులుగా ఎన్‌ఐఏ చార్జిషీట్‌లో పేర్కొంది. పుల్వామా దాడి ఘటనపై మొత్తం 13,500పేజీలతో కూడి చార్జిషీట్‌ని ఎన్‌ఐఏ జమ్మూ కోర్టులో సమర్పించనుంది. ఈ దారుణమైన ఉగ్రదాడులకు ఎలాంటి ప్రణాళిక రచించారు. పాక్ నుంచి ఎలా అమలు చేశారనే దాని గురించి సంబంధించి పూర్తి వివరాలను అధికారులు ఆ చార్జిషీటులో పేర్కొన్నారు.

అయితే.. ఈ దాడిలో 23 ఏళ్ల యువతి ఇన్‌షా జాన్ (23) ఉగ్రవాదులకు సహకరించిందంటూ ఎన్‌ఐఏ అరెస్ట్ చేసింది. పుల్వామాకు ప్రధాన కుట్రదారు అయిన ఉగ్రవాది మహ్మద్ ఉమర్ ఫరూక్‌తో పాటు మరికొందరు ఉగ్రవాదులతో ఆ యువతి సంబంధాలు నెరుపుతుండేదని ఎన్‌ఐఏ తన ఛార్జిషీట్‌లో పేర్కొంది. సోష‌ల్‌మీడియా, ఫోన్ సంభాషణలు నిత్యం చేసేదని ఎన్‌ఐఏ ధ్రువీకరించింది.

ఇన్‌షా జాన్‌కు, తీవ్రవాదులకు మధ్య జరిగిన మెసేజ్‌లను మేం సేకరించాం. ఆ మెసేజ్‌లో చాలా సామ్యాలున్నట్లు కూడా మేం కనుగొన్నాం. ఇదే విషయాన్ని మా ఛార్జిషీట్‌లో పేర్కొన్నామ‌ని ఓ అధికారి పేర్కొన్నారు. ఉగ్రవాదులతో నిత్యం సంబంధాలు నెరిపే విషయం ఆ యువతి తండ్రికి కూడా తెలుసని అధికారులు వెల్లడించారు. వారికి అవసరమైన ఆహారం, నివాసాలు, ఆయుధాలు ఇలా అన్నింటినీ బాలిక తండ్రి సమకూర్చే వారని అధికారులు పేర్కొన్నారు. దాడికి ముందు ఉగ్రవాదులు ఇన్‌షా జాన్ ఇంట్లోనే చాలా సార్లు బస చేసినట్లు తమ వద్ద ఆధారాలు కూడా ఉన్నాయని అధికారులు పేర్కొన్నారు. కాగా, 2019 ఫిబ్రవరి 14న లెతిపొరా సమీపంలో సీఆర్‌పీఎఫ్ జవాన్లపై దాడి జరిగింది. ఈ ఆత్మాహుతి దాడిలో 40 మంది సీఆర్పీఎఫ్ జవాన్లు మృతి చెందారు.

Next Story
Share it